అధ్యాయం 2, శ్లోకం 20
20
న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయ: |
అజో నిత్య: శాశ్వతో యం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ||
తాత్పర్యము : ఆత్మకు ఎన్నడునూ జన్మగాని, మృత్యువుగాని లేదు. అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. జన్మరహితమును, నిత్యమును, శాశ్వతమును, పూరాతనమును అగు అట్టి ఆత్మ, దేహము చంపబడినను చంపబడదు.
భాష్యము : ఆత్మ, పరమాత్మలో భాగమగుటచే ఒకే లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి శరీరము వలే మార్పు చెందదు. శరీరము పుట్టుట, ఎదుగుట, పిల్లలను కనుట, కొనసాగుట, క్షీణించుట, మరణించుట అను పరిణామాలకు లోనగును. అయితే ఆత్మ అటువంటి మార్పులకు గురికాదు. పుట్టుక ఉండదు కాబట్టి మృత్యువు కూడా ఉండదు. శరీ ర భావన వలన మనము ఎప్పుడు పుట్టాము అని చరిత్ర రాసుకుంటామే గాని అది ఆత్మకు సంబంధించినది కాదు. కావున ఆత్మ శాశ్వతమై, ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అందుచే భూత, భవిష్యత్ వర్తమానాలు ఆత్మకు వర్తించవు. చెట్ల లేదా భౌతిక వస్తువుల వలే ఆత్మ క్షీణించదు. శరీరము ద్వారా పిల్లలు పుట్టినా వారికి వేరే ఆత్మ ఉంటుంది. కావున ఆత్మ, వేరు ఆత్మలకు జన్మనివ్వదు. ఆత్మ మార్పు చెందనిది. ఆత్మవలన శరీరము మాత్రమే ఎదుగుతుంది. యవ్వనములో ముసలితనములో కూడా అదే ఆత్మను మనము కలిగి ఉంటాము. ఈ విధముగా శరీర మార్పులకు ఆత్మ అతీతమైనది. మనలో చైతన్యము ఉన్నట్లయితే ఆత్మ ఉన్నట్లే లెక్క. మనలోనే కాక చైతన్యము తక్కువగా కనబడే చెట్లు చేమలలో కూడా ఆత్మ ఉంటుంది. అయితే ఆత్మ అణువు వంటిదైతే పరమాత్మ విభువు, లేదా గొప్పదైనది. ఆత్మ అజ్ఞానముచే తన స్వభావమును మరచే అవకాశము ఉన్నది. కానీ పరమాత్మ, దానికి మూలమైన శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ వారి స్థితిని గాని, దేనినీ గాని మరచిపోరు. అందువలన కృష్ణుడు, అజ్ఞానములోనున్న ఆత్మ అయిన అర్జునునికి భగవద్గీతను బోధించుచున్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో