Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 10
10
తమువాచ హృషీకేశ:
ప్రహసన్నివ భారత |
సేనయోరుభయోర్మధ్యే
విషీదంతమిదం వచ: ||

తాత్పర్యము : ఓ భరతవంశీయుడా ! ఇరు సేనల నడుమ చిరునవ్వుతో శ్రీ కృష్ణుడు ఆ సమయమున దు:ఖితుడైన అర్జునునితో ఇట్లు పలికెను.

భాష్యము : కృష్ణుడు, అర్జునుడు, ఇరువురునూ ఆప్తమిత్రులు కావటం చేత సమానస్థితిలో నుండిరి. అయితే అర్జునుడు తనంతట తాను శిష్యుడిగా కృష్ణున్ని ఆశ్రయించెను. తన స్నేహి తుడు ఆ విధముగా శిష్యుడగుటను చూసి కృష్ణుడు మందహాసము చేసెను. దేవాదిదేవుడిగా భగవంతుడు అందరికంటే ఉన్నతుడే అయినా తన భక్తుడి కోరిక మేరకు ఒక స్నేహితుడుగా, ఒక పుత్రుడుగా, ఒక ప్రియుడుగా అగుటకు వెనుకాడడు. ఇక్కడ తనను గురువుగా స్వీకరించిన అర్జునునితో గంభీరముగా మాట్లాడనారంభించెను. ఈ సంభాషణ కురుక్షేత్ర రణరంగమున బహిరంగముగా చర్చించుట ద్వారా అందరికీ దానిని వినే అవకాశము ఇవ్వబడినది. అదేవిధముగా భగవద్గీత అందరినీ ఉద్దేశించి చెప్పబడినది కాబట్టి ఏ సమాజానికో, సంఘానికో కట్టుబడక చివరికి శత్రువులు, మిత్రులనే తారతమ్యాలు లేకుండా అందరూ వినవచ్చును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement