Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 20.

న ప్రహృష్యేత్‌ ప్రియం ప్రాప్య
నోద్విజేత్‌ ప్రాప్య చాప్రియమ్‌|
స్థిరబుద్ధిరసమ్మూఢో
బ్రహ్మవిద్బ్రహ్మణి స్థిత: ||

తాత్పర్యము : ప్రియమైనది పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైనది ప్రాప్తించినప్పుడు బాధ పొందని వాడు, స్థిర బుద్ధిని కలిగినవాడగును. మోహపరవశుడు కానివాడును భగవద్విజ్ఞానమును పూర్ణముగా తెలిసికొన్నవాడును అగు మనుజుడు పరబ్రహ్మము నందు స్థితిని కలిగి యున్నట్టి వాడే యగును.

భాష్యము : ఆత్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు ఇక్కడ తెలుపబడినవి. మొదటిది తాను కేవలము ఈ శరీరము అనే భావన కాక ఆత్మను, భగవంతునిలో అంశను అనే అవగాహనను కలిగి ఉంటాడు. దానివలన శరీరానికి సంబంధించిన వాటిని కోల్పోతే దు:ఖించుట గానీ, దేనినైనా సంపాదిస్తే ఉప్పొంగుట గానీ చెందక స్థిరబుద్ధిని కలిగి ఉంటాడు. కా బ ట్టి ఆత్మ అంటే శరీరము అనే భ్రమకు లోను కాడు, అలాగే శరీరమే శాశ్వతమని భావించి ఆత్మను మరచిపోడు. అటువంటి చైతన్యమునున వలన అతడు పరమ సత్యపు అవగామనలైన బ్రహ్మము, పరమాత్మ, మరియు భగవంతున్ని గురించిన పూర్తి తత్త్వాన్ని తెలుసుకునే స్థితికి చేరుకుంటాడు. తన స్థితిని కూడా అర్థము చేసుకుని తాను ఎప్పుడూ భగవంతుడితో సమానము అగుటకు ప్రయత్నించడు. అటువంటి స్థిర బుద్ధినే కృష్ణ చైతన్యమందురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement