అధ్యాయం 5, శ్లోకం 15.
నాదత్తే కస్యచిత్‌పాపం
న చైవ సుకృతం విభు: |
అజ్ఞానేనావృతం జ్ఞానం
తేన ముహ్యంతి జంతవ: ||
తాత్పర్యము : భగవానుడు ఎవరి పాపమును గాని, పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించెడి అజ్ఞానముచే మోహము నొందు చుందురు.
భాష్యము : జీవికి స్వేచ్ఛా లక్షణము ఉంది. ఆ కొద్దిపాటి స్వేచ్ఛను ఉపయోగించుకొని అనేక కోరికలను వాంఛిస్తుంది. అయితే అణు మాత్రపు జీవి కోరగలదే కాని వాటిని విభువైన సర్వైశ్వర్య భగవానుడు దీవించనిదే వాటిని పొందలేదు. ఆయన ఎల్లవేళలా సంపూర్ణుడై, సంతృప్తుడై ఉండుట వలన పాపపుణ్యాలకు అతీతుడై ఉండును. ఆయన నిష్పక్షపాతిగా వ్యవహరించును. ప్రతి వ్యక్తి యొక్క అర్హత మేరు వారి వారి కోరికలను తీర్చును. పరమాత్మ రూపములో మన హృదయములో ఉండి మన కోర్కెలను తెలుసుకొనును. అయితే వారు కృష్ణునితో సంబంధాన్ని కోరుకున్న యెడల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సహాయము చేయును. ఈ విధముగా జీవులకు కోరుకునే స్వేచ్ఛ ఇవ్వటము వలన ఫలితముగా వచ్చే సుఖదు:ఖాలకు వారే బాధ్యులు. భగవంతుడు కేవలము వారి అర్హతలు చూసి వారి కోరికలను నెరవేర్చును. అయితే అజ్ఞానములో నున్న జీవి తమ కష్టనష్టాలకు భగవంతుడే బాధ్యుడని ఆరోపణ చేయును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..