Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 5.

యత్‌ సాంఖ్యై: ప్రాప్యతే స్థానం
తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ
య: పశ్యతి స పశ్యతి ||

తాత్పర్యము : సాంఖ్యము ద్వారా పొందబడుస్థానమును భక్తియోగము ద్వారాను పొందవచ్చునని తెలిసికొని, తత్కారణముగా భక్తియోగము మరియు సాంఖ్యములను ఒకే స్థాయిలో నున్నవానిగా గాంచువాడు యధార్ధదృష్టి కలిగినవాడగును.

భాష్యము : సాంఖ్య పద్ధతి లేదా తత్త్వాన్వేషణ ద్వారా తెలుసుకునేదేమంటే నేను ఈ భౌతిక ప్రపంచమునకు సంబంధించిన వాడిని కాదు, నేను దీనిలో అంతర్భాగము కాదు. ఆత్మకు ఈ భౌతిక ప్రపంచముతో కాక పూర్ణుడైన భగవంతునితో అంశగా సంబంధము ఉన్నది. కాబట్టి నా కార్యాలు అతనితో సంబంధాన్ని పెంపొందించుకునే విధముగా ఉండాలి. అంటే సాంఖ్య పద్ధతి ద్వారా భౌతికమైన దాని నుండి సంబంధము వదులుకొనుట అయితే యోగము అనేది కృష్ణునితో సంబంధాన్ని పెంచుకొనుట వంటిది. కాబట్టి ఈ రెండింటి లక్ష్యమును ఒకటిగా చూడగలిగిన వాడే సరైన అవగాహన కలవాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement