అధ్యాయం 4, శ్లోకం 29
29
అపానే జుహ్వతి ప్రాణం
ప్రాణ పానం తథాపరే |
ప్రాణాపానగతీ రుధ్వా
ప్రాణాయామపరాయణా:
తాత్పర్యం : ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి, శ్వాసను సంపూర్ణముగా బంధించి, అంత్యమున సమాధిమగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియమించి ప్రాణవాయువును ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు.
భాష్యము : శ్వాసను నియమించునట్టి ఈ యోగ పద్ధతిని ప్రాణాయామము అనబడును. అందు దేహమునందలి వాయువులని నియమించి వాటిని విరుద్ధ దశలో ప్రసరింప చేయుటకు ప్రయత్నము చేయుదురు. అలా కుంభక యోగము ద్వారా యోగులు అనేక సంవత్సరములు వారి జీవనాన్ని పొడిగించుకోగలరు. అయితే కృష్ణ చైతన్యములో ఉన్న వ్యక్తి భగవత్సేవలో నిమగ్నుడ గుట వలన సహజముగనే ఇంద్రియములను నియంత్రించిన వాడై కృష్ణుని శాశ్వత ధామమునకు వెళ్ళును గనక ఇక్కడ జీవితకాలాన్ని పొగిడించుకోవాలని ప్రయత్నించడు. మిత ఆహారాన్ని స్వీకరించమనే యోగ నియమాన్ని, కేవలము కృష్ణ ప్రసాదాన్నే స్వీకరించే భక్తుడు అప్రయత్నముగానే పాటించినవాడవుతాడు. అలాంటి ఇంద్రియ నిగ్రహము లేనిదే ఎవ్వరూ ఈ భౌతిక బంధనము నుండి ముక్తులు కాలేరు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..