Wednesday, November 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 28

28
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా:
యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ
యతయ: సంశితవ్రతా:

తాత్పర్యము : కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు మరి కొందరు తీవ్రతపస్సులు చేయుట ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్యజ్ఞాన పురోగతికై వేదాధ్యయనము చేయుట ద్వారా జ్ఞాన వంతులగుదురు.

భాష్యము : అనేకమంది తమకున్న వాటిని సమాజ అభ్యున్నతికి దాన ధర్మాలు చేయుదురు. వాటిని ”ద్రవ్యమయయజ్ఞము”లు అందరు. మరి కొందరు స్వర్గలోక ప్రాప్తి కొరకు జీవిత సౌఖ్యాన్ని వదలి కఠినమైన తపస్సులను ఆచరించుదురు. వాటిని ”తపోమయ యజ్ఞము”లు అందరు. ఇక మరికొందరు సిద్ధులను కోరి గాని, బ్రహ్మములో లీనమవ్వాలని గాని హఠయోగ లేద పతంజలి యోగ పద్ధతులను పాటించుదురు. కొందరు తీర్ద యాత్రలను చేయుటలో మునిగి ఉంటే మరి కొందరు వేదాధ్యయనములో నిమగ్నులగుదురు. ఇలా రక రకాల యజ్ఞములందు నియుక్తులైన వ్యక్తులు ఉన్నత జీవన స్థాయిని కోరుకొందురు. అయితే కృష్ణ భక్తి విధానము అందులకు భిన్నమైనది. అది పైన చెప్పబడిన ఏ విధమైన యజ్ఞముల ద్వారా సాధ్యపడదు. కేవలము కృష్ణుడు, అతని భక్తుల కృప ద్వారా మాత్రమే ప్రాప్తించెడిది. కావున భగవంతుని ప్రత్యక్షసేవా విధానమైన కృష్ణభక్తిరస భావనము దివ్యమై యున్నది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement