అధ్యాయం 1, శ్లోకం 30
30
న చ శక్నోమ్యవస్థాతుం
భ్రమతీవ చ మే మన: |
నిమిత్తాని చ పశ్యామి
విపరీతాని కేశవ ||
తాత్పర్యము : నేను ఇపుడు ఏ మాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణా ! కేశిసంహారీ! కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను.
భాష్యము : కృష్ణుని ఇచ్చానుసారము అర్జునుడు మోహమునకు గురిచేయబడెను. అందువలన అతడు తన నిజమైన శ్రేయస్సును మరచెను. భగవంతుడి ఆనందాన్ని మరచి తన భౌతిక బంధనాలకు విలువనిచ్చెను. ఎవరైతే భౌతిక బంధనాలలో చిక్కుకుని పోతారో వారు భయమునకు లోనౌతారు. భగవంతునికి భిన్నముగా దేనిని చూసినా భయము తప్పదు. అటువంటి భావనలో ”నేనసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను. ఎవరికి వారు తమ స్వార్థాన్నే చూసుకొంటున్నారు” అని వాపోదురు. అలాగే ఇక్కడ అర్జునుడు కూడా విపరీతాలనే చూసెను. నేను యుద్ధములో విజయము సాధించినా అది దు:ఖానికే కారణము కాగలదు అని భావించెను. ఇలా జీవి కృష్ణుని ఆనందాన్ని మరచినపుడు కేవలము భౌతిక బాధలనే అనుభవిస్తూ ఉంటుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో