Sunday, November 3, 2024

గీతాసారం(ఆడియోతో)..

అధ్యాయం 4, శ్లోకం 21

21
నిరాశీర్యతచిత్తాత్మా
త్యక్తసర్వపరిగ్రహ:
శారీరం కేవలం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషమ్‌

తాత్పర్యము : అట్టి అవగహనము కలిగిన మనుజుడు నియమిత మనో బుద్ధులచే తనకున్నవానిపై తనదనెడి భావము విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మ చేయును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును.

భాష్యము : కృష్ణ చైతన్య వంతుడు తన కర్మల శుభా శుభ ఫలములను ఆశించడు. అతని మనోబుద్ధులు సదా నియమితములై ఉండును. తాను భగవంతునిలో అంశయై ఉన్నందున అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానునిచే చేయబడుచున్నదని ఎరుగును. ఎట్లనగా దేహము నందలి హస్తము తనకు తోచిన రీతిగా కాక దేహము కొరకే దాని ప్రోద్బలముతో పని చేయును. యంత్రము సరిగా పని చేయుటకు యంత్రము నందలి భాగమును శుభ్రపరచుట, తైలాదులతో పోషించుట, వంటివి అవసరమైనట్లే తన భగవత్సేవను సరిగా చేయుట కొరకే తన దేహమును పోషించును. భక్తుడు యజమాని అధీనములో ఉండే జంతువు వలె తన దేహముపై యాజమానిత్వము కలిగి ఉండడు. భగవత్సేవలో ఎంతగా నిమగ్నుడై ఉంటాడంటే భౌతికమైన వాటిని పొందటానికి కూడా తీరిక లేకుండా ఉంటాడు. పేరాశ లేనందున పాపముచే ఎన్నడునూ అంటబడడు. ఈ విధముగా అతడు సమస్త కర్మఫలముల నుండి ముక్తుడై ఉండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement