అధ్యాయం 4, శ్లోకం 16
16
కిం కర్మ కిమకర్మేతి
కవయో ప్యత్ర మోహితా: |
తత్తే కర్మ ప్రవక్ష్యామి
యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్
తాత్పర్యము : కర్మయనగా ఏమో మరియు అకర్మ యనగా ఏమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైత ము భ్రాంతి నొంది యున్నారు. కనుక కర్మయనగా ఏమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలిసికొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు.
భాష్యము : కృష్ణుడు తన భక్తుల యెడ కరుణతో కర్మ అనగానేమో వివరించబోవుచున్నాడు. లేనిచో మన మనో సంకల్పము చేత చేయు కార్యములు కేవలము బంధనానికే కారణము కాగలవు. మనకు తోచిన విధముగా కార్యములను చేసిన అనేక దుష్ఫలితములకు దారి తీయును. కావున ధర్మమనేది భగవంతుడు మాత్రమే నిర్ణయించగలడు(ధర్మంతు సాక్షాద్ భగవత్ ప్రణీతమ్) అటువంటి ధర్మాన్ని ఆయన గురు పరంపరలో భోది ంచుచున్నాడు. అటువంటి భక్తులను, మహాజనులను సామాన్యులు అనుసరించవలెను. లేనిచో బుద్ధిమంతులు సైతము భ్రాంతికి లోనైన సందర్భాలు పెక్కు కలవు. అర్జునుడంతటివాడిని కూడా కృష్ణుడు పూర్వాచార్యులను అనుసరించమంటున్నాడు, ఇక మన సంగతి చెప్పనేల!
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..