అధ్యాయం 4, శ్లోకం 10
10
వీతరాగభయక్రోధా
మన్మయా మాముపాశ్రితా: |
బహవో జ్ఞానతపసా
పూతా మద్భావమాగతా:
తాత్పర్యము : రాగము, భయము, క్రోధము నుండి విడివడి, నా యందు సం పూర్ణముగా మగ్నుడవై నాకు శరణు జొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై దివ్యప్రేమను పొందగలిగిరి.
భాష్యము : భగవంతుని యదార్ధముగా తెలిసికొనుటకు, ప్రేమను పెంపొందించు కొనుటకు మూడు రకములైన భౌతిక అవరోధములను విడిచి పెట్టవలెను. మొదటిది : రాగము, భౌతిక ప్రపంచమున ఆనందాన్ని అన్వేషిస్తూ ఆధ్యాత్మిక జీవితము పట్ల ఆసక్తి లేకుండుట. రెండవది : భయము, భౌతిక ఆనంద అన్వేషణలో కష్టాలను, ఎదురు దెబ్బలనూ చవి చూసిన వ్యక్తి తనకు ఎటువంటి సంబంధాలు వద్దని నిర్ణయించుకుంటాడు. దాని వలన భగవంతునితో సంబధమే జీవిత లక్ష్యమని తెలిసినపుడు భయమునకు గురి అవుతాడు. చివరికి భగవంతునిలో లీనమగుటకే మొగ్గు చూపుతాడు. ఇక మూడవది : క్రోధము, వేరు వేరు వ్యక్తుల నుండి రకరకాల తత్త్వాలను విని, వాటిలో ఏది సత్యమో తెలిసికొనలేక వాటిలో విరుద్ధ భావాలకు తికమక పడి చివరకు విసుగు చెంది మత్తు పదార్థాలకు బానిస అవుతాడు. ఎప్పుడైతే వ్యక్తి గురువు శిక్షణలో ఈ మూడు దశలను అధికమించి భగవంతుని ఆశ్రయాన్ని స్వీకరిస్తాడో అతడు క్రమేణా పురోగతి చెంది భగవంతుని భావాన్ని, ప్రేమను పొందగలుగుతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..