అధ్యాయం 3, శ్లోకం 13
13
యజ్ఞశిష్టాశిన: సంతో
ముచ్యంతే సర్వకిల్బిషై: |
భుంజతే తే త్వఘం పాపా
యే పచంత్యాత్మకారణాత్ ||
తాత్పర్యము : యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారమును సిద్ధము చేసికొనువారు కేవలము పాపమునే భుజింతురు.
భాష్యము : భక్తులు భగత్ప్రియులు. అందుచేత భగవంతుని శ్రవణ కీర్తనాదులలో నిమగ్నులై ఉందురు. ఇటువంటి యజ్ఞ నిర్వహణము వలన వారు ఎటువంటి భౌతిక కాలుష్యముకునూ ప్రభావితము కారు. అట్లుగాక భగవంతుడిచ్చిన వసతులను, ఆహారమును తమ ఆనందము కొరకే భుజించువారు చోరులే కాక సర్వవిధములైన పాపములను భుజించిన వారగుదురు. చోరుడు, పాపియైన వ్యక్తి ఆనందముగా ఎలా ఉండగలడు ? కాబట్టి ప్రపంచము నందు ముఖము, శాంతి నెలకొన వలెనన్న ”హరినామ సంకీర్తన” మను యజ్ఞమును నిర్వహించవలసి ఉన్నది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..