అధ్యాయం 5, శ్లోకం 1
అర్జున ఉవాచ…
సన్న్యాసం కర్మణాం కృష్ణ
పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం
తన్మే బ్రూహి సునిశ్చితమ్ ||
తాత్పర్యము : అర్జునుడు ఇట్లు పలికెను : ఓ కృష్ణా! మొదట నన్ను కర్మ త్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుతకర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము.
భాష్యము : శ్రీ కృష్ణుడు ఈ అయిదవ అధ్యాయములో మానసిక కల్పన కంటే భక్తితో చేసే కర్మయే ఉన్నతమైనదని తెలియజేయనున్నాడు. రెండవ అధ్యాయములో బుద్ది యోగము ద్వారా ఆత్మ యొక్క భౌతిక బంధము నుండి ఎట్లు ముక్తుడవ్వవచ్చునో తెలియ జేసెను. ఇక మూడవ అధ్యాయములో జ్ఞాన వంతుడు చేయ వలసిన కర్మలంటూ ఏమీ ఉండబోవని, నాల్గవ అధ్యాయము నందు అన్ని రకాల యజ్ఞములు జ్ఞానము కొరకేనని సూచించెను. అయితే నాలుగవ అధ్యయము చివరలో శ్రీ కృష్ణుడు, ” అర్జునా జ్ఞానము నందు స్థితుడవై యుద్ధము చేయుము”, అని చెప్పుటచే అర్జునునికి ఈ సందేహము కలిగినది. జ్ఞానములో ఉన్న వ్యక్తి కర్మ చేయవలసిన అవసరము లేదని, అన్ని కర్మలూ ఉన్నది జ్ఞాన సముపార్జన కేనని చెప్పి, ఇప్పుడు జ్ఞానముతో యుద్ధము లేదా కర్మ చేయమని అనుటలో అర్ధమేనని సందేహము వెలుబుచ్చెను.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..