Saturday, September 21, 2024

గంగానది ఆవిర్భావం- ప్రాశస్త్యం

పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు జీవనదులకు పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ముక్కోటి దేవతలు, మూడున్నరకోట్ల తీర్థములతో, మహర్షులతో పుష్కరునితో ఆయా జీవనదుల్లో మునిగి తమతమ దివ్యశక్తి తరంగాలతో వాటికి మరింత జీవం పోస్తారు. ఆ సమయంలో ప్రజలు కూడా ఆ జీవనదుల్లో మునిగితే వారికి పుణ్యశక్తి సంప్రాప్తిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. ప్రతి నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రోజులపాటు పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా బృహస్పతి మేషరాశిలో ప్రవేశించిన నేటి (22వ తేదీ శనివారం)నుంచి గంగానది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. బృహస్పతి మీనంలో ప్రవేశించినప్పుడు మే 3వ తేదీ బుధవారంతో ముగుస్తాయి.
పూర్వము తుందిలుడు (పుష్కరుడు) అనే బ్రాహ్మణోత్తముడు మహేశ్వరుని గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు పుష్కరుడు ”జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి. నదులు పునీతమైతే దేశమూ సుభిక్షంగా ఉంటుంది. అందుకే దేవా! నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్లు వరమివ్వు’ అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ”నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఆ సమయంలో ఆ నదిలో స్నాన మాచరించినవారు పాపవిముక్తలవుతారు. జన్మరాహిత్యాన్ని పొందుతా రు” అని వరమిచ్చాడు. పుష్కర మహత్మ్యం తెలుసుకున్న దేవతల గురువు బృహస్పతి తనకూ పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డు చెబుతాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాతి నిధ్యం కల్పించాడు బ్రహ్మ. పుష్కరుని కోరికపై బ్రహ్మదేవుడు ముక్కోటి దేవతలతో మూడున్నర కోట్ల తీర్థములతో, మహర్షులతో, ఆ పుష్కరుని వెంట ఉండగా, బృహస్పతి, ఆయా రాశులలో (మేషాది రాసులలో) చరించు చున్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు నిర్వహిస్తారు. గంగా పుష్కరోత్సవాల సందర్భంగా గంగామాత ఆవిర్భావం, మహాత్మ్యం గురించి తెలుసుకుందాం.
”హరి పద పాద్య తరంగిణి గంగే / హమ విధుముక్తా ధరళ తరంగే
దూరీ కురు మమ దుష్ప్వతి భారం/ కురు కృపయా భవసాగర పారమ్‌!!”
”గంగామాత! నీవు శ్రీహరి పాద తీర్థంగా, ఉద్భవించిన నదీమ తల్లివి. నీ తరం గముల ధవళకాంతులు హమము చంద్రకాంతి ముత్యాల వలే భాసిల్లుతున్నాయి. నా సకల పాప భారాన్ని తొలగించి, నన్ను ఈ సంసార సాగరాన్ని దాటించు.” (ఆది శంకరాచార్య గంగా స్తోత్రం నుండి)
భగవద్గీతలో శ్రీకృష్ణుడు గంగతో తనకు గల సంబంధాన్ని తెలియచేసారు.
”ఓ! గంగమ్మా! నీ జలాన్ని పావనం చేసేవారు, పరమపదాన్ని తప్పక పొందు తారు. యముడు కూడా నీ భక్తుల వైపు కన్నెత్తి చూడడు కదా!” అని చెప్పారు.

గంగానది ఆవిర్భావం

గంగానది ప్రస్థావన ఋగ్వేదంలో ఉందని వేదపండితులు చెపుతారు. గంగా నదిని భగీరథుడు ఆకాశం నుండి భూమి మీదకు తెచ్చాడని పురాణం చెబుతోంది. సూర్యవంశపు రాజు సగర చక్రవర్తికి కేశిని, సుమతి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు అసమంజసుడు, రెండవ భార్య ద్వారా అరవై వేలమంది పుత్రులు జన్మించారు. ఒకసారి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయ సంకల్పించి, ప్రారంభించాడు. ఇం ద్రుడు అది గమనించి, ఆ యాగాన్ని భస్మం చేయాలని ఆ యాగాశ్వాన్ని పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. వెంటనే విషయం తెలిసిన సగరుడు పుత్రులను అశ్వాన్ని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. వారు పాతాళానికి వెళ్ళి కపిల మునిని దూషిస్తారు. కపిల మహాముని శాపం వల్ల భస్మం అయిపోయారు. అపుడు సగర చక్రవర్తి విచారించి, తన మొదటి భార్య కుమారుడు అసమంజసుడు పుత్రుడు అంశుమంతుడిని యజ్ఞాశ్వమును రక్షించే నిమిత్తం పాతాళానికి బయలుదేరాడు.
దారిలో దిగ్గజాలను చూసాడు. వారి సూచన మేరకు పాతాళానికి చేరాడు. భస్మ మై పడిఉన్న తన పినతండ్రులను చూసి దు:ఖించాడు. వారందరికీ జలతర్పణాలు ఇవ్వాలని తలచి చూస్తే జలాశయమేదీ కనపడలేదు. నాలుగు దిక్కులు పరీక్షించి చూడగా, వాయు సమానుడు, పినతండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడ్డా డు. ”ఓ బుద్ధిమంతుడా! వీరికి లౌకికమైన ఉదకముతో తర్పణాలు ఉచితము కాదు. హమవంతుని కూతురు గంగానది నీటితోనే చేయాలి. అపుడే వీరికి ఉత్తమ లోకాలు సంభవిస్తాయి” అని చెబుతాడు. అసుమంతుడు యాగాశ్వాన్ని తీసుకొని రాజ్యానికి చేరాడు. యజ్ఞం పూర్తయింది. గంగానదిని భూమి మీదకు తీసుకురావడం అసుమం తుడు, అతని పుత్రుడు దిలీపుడు వల్ల కూడా కాలేదు. ఆ దిలీపుడు కుమారుడు భగీర థుడు తాత, ముత్తాతల ఆశయం నెరవేర్చడానికి, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయ గా, గంగాదేవి ప్రత్యక్షమై, ”భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను ఏ వరం కావాలో కోరు కో” అంది, ”దేవీ! మహాత్ములైన నా పితామహుల భస్మాన్ని పవిత్రం చేయడానికి నీవు భూలోకంలో నుంచి, పాతాళలోకం వరకు ప్రవహంచు” అని కోరాడు.
ఆమె ”సరే! నేను ఆకాశం నుండి భూమి మీదకు జారుతున్నప్పుడు భూమి సహంపజాలదు. అందుకు తగిన స్థానం చూపి రా!” అని చెప్పగా భగీరథుడు మరల శివుని గురించి తపస్సు చేసి విషయం తెలుపగా, లోక కళ్యాణార్థం, భూదేవికి ఉపశ మనార్థం ఆకాశం నుండి పడుతున్న గంగను ముందుగా తన జటాజూటంలో ఉంచ గా, నెమ్మదిగా ఏడు పాయలుగా భూమి మీదకు జాలువారింది గంగ.
భగీరథుడు దివ్యరథంపై వెడుతుంటే, గంగ అనుసరించి భూమిని, అక్కడ నుండి పాతాళానికి చేరింది. అపుడు, భగీరథుడు బ్రహ్మ అనుమతితో తన తాత, ముత్తాతల అందరికీ ఉత్తమలోకాలు ప్రాప్తించేటట్లు గంగాజలంతో, ఆ భస్మాన్ని తడిపేసాడు. ఆ తర్వాత బ్రహ్మ ”భగీరథా! లోకంలో ఈ సాగరజలాలు ఉన్నంత కాలం సగర పుత్రులు దేవతలవలె స్వర్గలోకంలో ఉంటారని, ఈ గంగ నీకు పెద్దకు మార్తె అయి, ‘భగీరథీ’ నామంతో లోకమందు ప్రసిద్ధి పొందుతుందని” చెప్పారు.
అందుకే మన పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తికై వారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తాము. గంగ సోదరీమణులు అయిన గోదావరి, కావేరి, కృష్ణా నదిలలో నిమజ్జనం చేసినా ఉత్తమ లోకాలు కలుగుతాయని గంగ అభయం ఇచ్చింది. గంగ పుట్టింది మొదలు సముద్రంలో కలిసేదాకా ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. ఆ ఒడ్డున ఎన్నో నాగరికతలు పుట్టాయి. ఎన్నో సామ్రాజ్యా లు వెలిశాయి! మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం! అందుకే గంగా నది పవిత్రంగా భావించి, పరి శుభ్రత పాటించడం మన కర్తవ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement