మితము- అమితము : గణనాథుని హితోక్తి గూర్చి డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
వినాయకునికి గణాధిపత్యం లభించిన పిదప బ్రహ్మది దేవతలు గణపతికి ప్రియమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం వంటి రుచికరమైన తినుబండారాలతో విందు చేశారు. అన్నింటిని ప్రీతితో కడుపు నిండా స్వీకరించిన గణపతి సంతోషంతో నాట్యం చేస్తూ తన తల్లిదండ్రులకి సాష్టాంగ ప్రణామం చేయడానికి అవస్థపడగా ఇది గమనించిన చంద్రుడు పరిహాసం చేశాడు. రాజదృష్టితో రాళ్ళు పగిలినట్టు చంద్రుడు దృష్టి తగిలి వినాయకుడు పొట్ట పగిలి మరణించెను. దానితో పార్వతికోపోద్రుక్తురాలై చంద్రుని చూసినవారికి నీలాపనిందలు వస్తాయని శపించడం అందరికీ తెలిసిందే.
పదవి పొందగానే ఒళ్లు, స్థితి మరచి ఎవరేమిచ్చినా హద్దు మీరి స్వీకరిస్తే వికటిస్తుంది. ఆహారంలో హితము మితము పాటించాలి. మితి మీరితే పెట్టినవారికి, తిన్నవారికి, చూచినవారికి నీలాపనిందలే. ఆహారం ప్రాణం నిలపడమే కాదు మితిమీరితే ప్రాణాలు తీస్తుందని తెలియజేస్తుంది గణపతి వృత్తాంతం. పదవి ప్రాప్తిస్తే స్వార్థంమాని పదిమందికి పెట్టి తృప్తి పడాలని ఆ పదవిని పదిమందీ మెచ్చినపుడే సంబరమని సందేశం ఇస్తుంది గణపతి వృత్తాంతం. ఉండ్రాళ్లను చూసినంతనే తినాలనే ఆశపుడుతుంది. వస్తువును చూచిన వెంటనే అనుభవించాల నే ఆశ కలగించేది ప్రకృతి అనగా కోరికలు. కుడుములు త్వరగా అరగవు కావున అవి పాపాలు. పాయసం మధురంగా ఉంటుంది కావున అది భక్తి. గణపతి కి భక్తితో మన కోరికలు నివేదించి పాపాలను తొలగించమని అనగా విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధిని, తృప్తిని, ఫలితాన్ని కలిగించమని అర్థం. ఇది చూసే చంద్రుడు పరిహసించాడు.
చంద్రుడు అనగా మనస్సు. ‘చంద్రమా మనసో జాత:’ అని వేదవాక్యం. మనసు మనని చూసి పరిహసిస్తుంది. బుద్ధి చెప్పిన విధంగా నడుచుకుంటే ఆధిపత్యం లభిస్తుంది. మనస్సు చెప్పినది వింటే పతనమవుతాము. పాపాలతో కాక పుణ్యాలతో కోరికలు కలిగితే బుద్ధి, సిద్ధులు మనవశమయ్యి అధిపతులమవుతామని నీతి పాఠాలు, ధర్మోపదేశాలు చేసి యోగమార్గంలో పరమాత్మను చేర్చే పరమగురువు మన గణనాథుడు. గణనాథుని ఉపదేశాలను, సందేశాలను స్వీకరించి పుణ్యం పొంది మోక్షమార్గాన పయనిద్దాం.