Tuesday, November 26, 2024

సర్వనాశనకరం జూదం!

సప్త వ్యసనాల్లో జూదం ఒకటి. వ్యసనాలన్నీ హాని చేసేవే. అవి మనుషుల్ని తమ బానిసలుగా చేసుకుని అనేక కష్టాలకు గురిచేస్తాయి. నేటి యుగంలో ఎందరో ధనవంతులు వ్యసనాలను జయించలేని బల#హనత కారణంగా సర్వస్వము కోల్పోయి బికారులుగా మారడం చూస్తుంటాము. వారిని చూసి జాలి పడడం తప్ప ఇంకేమీ చేయలేము. ఒకవేళ ఆర్ధిక సహాయం చేసినా సరే వారు దానిని సద్వినియోగం చేయరు. సరికదా ఆ ధనంతో తమ వ్యసన సరదా తీర్చుకోడానికి పరుగెడతారు.
కలియుగంలోనే కాదు గత యుగాల్లో కూడా వ్యసనాల బారినపడి నాశనమైన వారి కథలను పురాణా లు తెలిపాయి. మహాభారతంలో ధర్మరాజు, నలమహారాజు కథలు అలాంటివే. దుర్యోధనుడితో పాచికలా డి ఓడిపోయిన ధర్మరాజు సోదరులు, భార్యతో కలసి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఏడాది అజ్ఞాత వాసం చేసాడు. ఆ సంఘటనే కురుక్షేత్ర యుద్ధానికి బీజాలు పడడానికి కారణమయ్యింది. అందువల్లనే కౌరవ వంశం నాశనమయ్యింది. ఇక నలుడు కూడా తన సోదరుడు పుష్కరుడితో పాచికల ఆట ఆడి తన సంపద ను, రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భార్యాపిల్లలకి దూరమై అనేక కష్టాలు అనుభవించాడు.
ఇక భాగవతంలో కూడా జూదం మీద ఒక కథ ఉంది. కథ ఏదైనా అందించే సందేశం ఒకటే. వ్యసనాల వలన వినోదం కన్నా చేటు ఎక్కువ.
రుక్మి కుమార్తె రుక్మవతికి, రుక్మిణి కృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడికి వివా హం జరుగుతోంది. ఆ వేడుక చూడడాని కి ఆహ్వానితులైన బంధుమిత్రులు, రాజు లతో కల్యాణ వేదిక కడు రమణీయంగా ఉంది. యాదవుల కీర్తి, ఐశ్వర్యాలను చూ సి ఓర్వలేని రాజులు ఆ కాలంలో చాలా మంది ఉండేవారు. వారిలో కళింగరాజు ఒకడు. అతడికి యాదవుల వైభవం చూసి కన్నుకుట్టింది. వెంటనే మండుతు న్న #హృదయంతో రుక్మి దగ్గరకు వెళ్ళాడు.
”కొత్త బంధుత్వ మమకారంలో మునిగిపోయావా? యాదవులు చేసిన పరాభవాన్ని, అవమానాన్ని దిగమ్రింగావా? వారి మీద ప్రతీకారం తీర్చుకోడానికి ఇంతకంటే తగిన సమయం దొరకదు. బలరాముడికి జూదమంటే ప్రీతి అని తెలుసు. కానీ అతడికి జూదం ఆడటం తెలియదు. అతడిని ఆటకి ఆహ్వానించు. నువ్వు ఆహ్వానిస్తే అతడు జూదమాడి తీరతాడు. అప్పుడు అతణ్ణి ఓడించి ప్రతీకారం తీర్చుకుంటే నీకు కొంతైనా మనశ్శాంతి దక్కుతుంది. వెంటనే అతడిని జూదానికి పిలువు” అని కళింగరాజు ప్రేరేపించాడు.
ఆ మాటలతో వివేకాన్ని కోల్పోయిన రుక్మి వెంటనే వెళ్లి బలరాముణ్ణి జూదానికి ఆహ్వానించాడు. ఆహ్వానాన్ని తిరస్కరించడం చేతకానితనం అవుతుందని భావించిన బలరాముడు సరేనన్నాడు.
వారిద్దరూ జూదం ఆటకు కూర్చున్నారు. వారి ఆట రసవత్తరంగా సాగింది. ఇద్దరిలోనూ గెలవాలన్న పట్టుదల పెరిగింది. వారు ఒడ్డే పందాలు పెరిగాయి. అయితే ఆటలో ప్రావీణ్యత లేని కారణంగా వరుసగా ఆటలన్నిట్లో బలరాముడు ఓడిపోయాడు. కళింగరాజుతో సహా అక్కడున్న రాజులంతా బలరాముడు ఓడిన ప్రతిసారీ ఎగతాళిగా నవ్వారు. అలా ప్రేరేపించింది మాత్రం కళింగరాజు.
అక్కడున్న రాజుల ప్రవర్తన బలరాముడికి చాలా చికాకు పెట్టింది. ఆయనలో క్రోధం పెరిగింది. వారు ఆడిన తరువాత ఆటకి లక్ష బంగారు నాణాలను పందెంగా ఒడ్డాడు. అదృష్టవశాత్తూ ఆసారి బలరాముడే గెలిచాడు ఆటలో. దాన్ని రుక్మి ఎంత మాత్రం అంగీకరించనన్నాడు. చుట్టూ కూర్చుని ఆటను చూసి ఆనం దిస్తున్న రాజులందరినీ నిజం చెప్పమని బలరాముడు అడిగాడు. వారంతా రుక్మికి భయపడి నోరు విప్పలే దు. తరువాత మరో ఆట ఆడారు. అందులో కూడా బలరాముడే గెలిచాడు. అయినప్పటికీ రుక్మి ఒప్పుకోలే దు. అక్కడి రాజులూ నిజం చెప్పలేదు.
వారందరినీ ఆశ్చర్యపరిచేలా ”బలరామునిదే గెలుపు. రెండుసార్లు రుక్మి ఓడిపోయాడని” ఆకాశవా ణి మాత్రం పలికింది. ఆకాశవాణిని కూడా రుక్మి అంగీకరించలేదు. ”అశరీరవాణిని నమ్మను. గెలుపు నాదే. జూదం అనేది కేవలం రాజుల ఆట. అలాంటి ఆటలో యాదవులకు నైపుణ్యం లేదు. వాళ్లు గెలిచినా చెల్లదు” అని గర్వంగా అన్నాడు. అది విన్న రాజులందరూ విరగబడి నవ్వారు.
బలరాముడికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. చుట్టూ చూసాడు. అక్కడొక ఇనుప గద కనబడితే దాన్ని అందుకుని దాంతో రుక్మిని చావబాదాడు. అవహళనలతో అంతవరకూ యాదవులను ఎగతాళి చేసి న కళింగరాజుకి పండ్లూడ గొట్టాడు. బలరాముడి ఉగ్రరూపం చూసిన రాజులందరూ అక్కడ నుండి పారి పోయారు. అక్కడ జరుగుతున్నది చూస్తున్న శ్రీకృష్ణుడు మాత్రం ఏమీ తెలియనట్టు చిద్విలాసంగా నవ్వు కున్నాడు. ఏ కాలమైనా, ఏ యుగమైనా వ్యసనాల వలన వినోదం కంటే హాని ఎక్కువ జరుగుతుందని ఈ కథ కూడా సందేశమిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement