Tuesday, November 19, 2024

గజేంద్ర మోక్షణము (శ్లోకద్వయమ్‌..) – జీవా గురుకులం (ఆడియోతో)…

శ్లో|| గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్యక్షమారుహ్య ధావన్‌
వ్యాఘూర్ణన్‌ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీర ఘోష:
ఆబిభ్రాణో రంథాంగం శరమసి మభయం శంఖ చాపౌ సఖేటౌ
హస్తై: కౌమోదకీ మప్యవతు హరి రసావంహసాం సంహతేర్న:||

తాత్పర్యము : గజేంద్రుడు ఒకనాడు ఒక మడుగులో మొసలిచే పట్టబడినాడు. బయటపడుటకు ఎన్నిరకములుగా ప్రయత్నించినను విఫలుడాయెను. ”నీవే దిక్కని” భగవానుని ఆక్రోశించెను. అది చెవిసోకిన వెంటనే తీవ్ర ఆర్భాటముతో గరుడినిపై అధిరోహించి ఆతనిని నడుపుకొనుచు దొర్లుకొంటూ తిరుగుతూ పరుగిడి ఆ భగవానుడు దిగెను. ‘మాశుచ:’ అంటూ పెద్దగా ఓదార్చును. అపుడాతడు మాలికలు, ఆభరణములు, పీతాంబరము మొదలగు ధ్వనించు అలంకరణలతో మెరయుచు మేఘమువలె ప్రకాశించుచుండెను. తన హస్తములయందు శ్రీ సుదర్శన చక్రము, బాణము, ఖడ్గము, శ్రీపాంచజన్య శంఖము, శార్గమను ధనుస్సు, డాలును కత్తినింపు ఒరలను ధరించి, ఒక చేతితో అభయము చూపు చుండెను. ఒక జంతువు ఆపదను బాపుటకు అంత త్వరపడిన భగవానుడు శ్రీహరి, ప్రేమతో కొలిచెడి మనలను సమస్త పాపముల నుండి తప్పక రక్షించును. కర్మబంధముల నుండి మనలనాతడు విముక్తలను చేయుగాక!

శ్లో|| నక్రా క్రాన్తే కరీంద్రే ముకుళిత నయనే మూల మూలేతి ఖిన్నే
నాహం నాహం న చాహం, న చ భవతి పున స్తాదృశ్యో మాదృశేషు|
ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే
మూలం యత్ప్రాదు రాసీత్‌ సదిశతు భగవాన్‌ మంగళం సంతతం న:||

తాత్పర్యము : మకరి, గజేంద్రుడిని మడుగులో విడువక పట్టినది. వేయి సంవత్సరముల పోరు సాగెను. తన శక్తితో పోరుస‌ల్పి డ‌స్సిపోయెను. బంధువులెవ్వరూ కాపాడరైరి. కన్నులు మూతపడినవి. ఇక దైవశక్తి తప్ప వేరు రక్షకము లేదని తెలిసినది. కాని ఎవరా కాపాడెడి దైవము? అన్ని జగములను సృష్టించి రక్షించి లయింపజేయు ఆధికారణమైనవాడే, మూల కారణమైన వాడే రక్షించవలెను అతని పేరేమి? ఊరేమి? తెలియదు. అపుడా కరీంద్రుడు మూలా! మూలా! అని మూల కారణమును పిలిచెను. ఆ పిలుపు మొదట దేవలోకము చేరగా ‘అమ్మో మేముకాదు- మూల కారణము” అని వారు చేతులెత్తివేశారు. ఆ పిలుపు ఇంద్రుని చేరెను. అతడు కూడా ”నేనున్నూ మూలకారణము కానని” వెనుదిరిగెను. ఆ పిలుపు కైలాసగిరిని చేరును. ”నేనున్నూ మూలకారణమునకు గల లక్షణములు కలవాడునుకాను” అని రక్షింప రా సాహసించలేదు. చివరకి బ్రహ్మలోకముగూడ చేరెను. ఆ చతుర్ముఖుడు ”మాలో ఎవ్వరిలోనూ జగ త్కారణము కాదగిన లక్షణములు ఉండవు. ఇచత వెతుకుట వ్యర్థ”మని చేతులు ఎత్తివేసిరి, రక్షించు నాథుడెవ్వడూ దొరకని ఆ సమయమున ఆ గజేంద్రుని పిలుపుకు పలుకగల మూలకారణము ఒక డు ఆవిర్భవించెను. ఆతడు శ్రియ:పతియగు శ్రీమన్నారాయణుడు. శంఖ చక్రాద్యాయుధధారి, సర్వ జగత్కారణమగు ఆ శ్రియ:పతియే సదా సమస్త మంగళములను ప్రసాదించుగాక!

Advertisement

తాజా వార్తలు

Advertisement