దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాలు చవిచూశాయి. 3 గంటల వరకు లాభాల్లోనే కదలాడిన సూచీలు.. ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీగా క్షీణించాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్, కన్జ్యూమర్ గూడ్స్ స్టాక్స్‌లో భారీగా అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్‌లోనూ భారీగా నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్ 57,381.77 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,464.08 పాయింట్ల గరిష్టానికి, 56,009.07 పాయింట్ల కనిష్టానికి సెన్సెక్స్ తాకింది. చివరికి 703.59 పాయింట్లు నష్టపోయి.. 56,463.15 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఉదయం 17,258.95 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 17,275.65 పాయింట్ల గరిష్టానికి, 16,824.70 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 215 పాయింట్లు నష్టపోయి 16,958.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే.. రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.50 వద్ద ట్రేడ్ అవుతున్నది.
ఫ్లాట్‌గా ప్రారంభమై..
ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. ఆద్యంతం ఊగిసలాట మధ్య పయనించాయి. చివరి అర గంటలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ వైపు పరుగులు పెట్టడంతో.. ఒక్కసారిగా మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ భయాలు వంటివి ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పుకోవాలి. దీనికి తోడు ఎఫ్‌ఐఐల నిష్క్రమణ, బాండ్ల రాబడుల పెరుగుదల, చమురు ధరలు ఎగబాకడం కూడా సూచీలను ఒక్కసారిగా కిందికి లాగాయి. చైనాలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అండగా నిలిచేందుకు అక్కడి ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది కొంత దేశీయ మార్కెట్‌కు లాభదాయకమే అయినప్పటికీ.. ఇన్వెస్టర్లు దీన్ని పట్టించుకోలేదు. దీనికితోడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు మాత్రం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
1.66 శాతం నష్టపోయిన స్మాల్ క్యాప్
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.37 శాతం, స్మాల్ క్యాప్ 1.66 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఐటీ 2.98 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 2.82 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.03 శాతం పతనం అయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ టాప్ లూజర్‌గా నిలిచింది. షేరు 6.26 శాతం మేర పతనమైంది. చివరికి రూ.2,121.75కు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్తాన్ యూనిలీవర్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, నెస్లే ఇండియా నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ముగిశాయి. కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు సూచీలపై కొంత ప్రభావం చూపాయని చెప్పుకోవాలి. మైండ్ ట్రీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ షేర్లు ఐద శాతానికి పైగా పతనం అయ్యాయి. ఏప్రిల్ 4 తరువాత.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.1.67 లక్షల కోట్లు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ సైతం తన మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.91,595 కోట్లు కోల్పోయింది. ఇంధన రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ ఇంధన సూచీ 2 శాతానికి పైగా లాభపడింది. బీఎస్‌ఈ ఇంధన సూచీ 3 శాతానికి పైగా ఎగబాకి.. జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసుకుంది. అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 4.5 శాతం మేర లాభపడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..