ఉపనిషత్తు వాక్యం ”మాతృదేవోభవ, పితృదేవోభవ” అని ఇదే విషయాన్ని వేదాలు కూడా చెపుతున్నాయి. స్త్రీ (తల్లి) లేని ఇల్లు దేవుడు లేని గుడి ఒక్కటే! అంటారు. మను ధర్మం ”యత్రనార్యంతు పూజ్యంతే, తత్ర దేవతా:” అని అంటే ఎక్కడ స్త్రీ ఆరాధించబడుతోందో, గౌరవించబడుతోందో, అక్కడ దేవతలు ఉంటారు అని భావం. ద్రౌపదిని పరాభవించిన కౌరవులు ఎలా పతనమయ్యారో? తెలుసు కదా! అలాగే పరమ పవిత్రమైన సీతాదేవిని కామవాంఛతో లంకలో బంధించిన రావణాసురుడు ఆఖరికి అసువులు బాసినాడు. ఇక్కడొక ఆర్యోక్తి చెప్పుకోవాలి.
కార్యేషు దాసి, కరుణేషు మంత్రి
భోజ్యేషు మాత శయనేషు రంభా
రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ !
షట్కర్మ యుక్తాక్షుల ధర్మపత్నీ!! భార్య ఎలా ఉండాలో ఆరు సుగుణాలు చెప్పారు. కాని వడివడి జీవితంలో
స్త్రీ ఒత్తిడికి గురవుతోంది. దుష్యంత మహారాజు తన భార్య శకుంతల కొడుకుతో వస్తే, దుష్యంతుడు ”నువ్వు ఎవరో తెలియదు వెళ్ళిపొమ్మని ఆదేశించి”న సందర్భంలో శకుంతల బదులిస్తూ – మహారాజా! ధర్మ, అర్థం, కామం, అనే పురుషార్థాలు సాధించడానికి, వంశం నిలబెట్టడానికి, నిర్మలమైన శీలాన్ని గురించి ప్రభోదించడానికి, ఉత్తమ గతులు పొందడానికి హృదయానందాన్ని కలిగించేది భర్తకు భార్య మాత్రమే!
అంటే గృహస్థాశ్రమ రక్షణకు కేంద్రబిందువు గృహిణి అని చాలా బోధించింది. ప్రక్కన భార్య లేకపోతే, ఎటువంటి యజ్ఞయాగాలు కాని, వ్రతాలు కాని చేయకూడదు. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
మన వివాహ వ్యవస్థ చాలా గొప్పది. వివాహ సమయంలో వధువును ”లక్ష్మీ” స్వరూపంగా, వరుడును ”నారాయణ” స్వరూపంగా భావిస్తారు. వివాహ సందర్భంలో ”గృహాన్గశ్చ గృహపత్నీ చథా సో వశినీత్త్వం విదిధే మా దాసీ” స్థాళిపాక హోమ సమయంలో అంటారు అంటే వరుడు వధువుతో ”నువ్వు మాఇంటికి అధిపతిగా రావాలి. మమ్మల్ని నడిపించు” అంటాడు.
సీతాదేవి లంకలో బంధించబడిన సందర్భంలో ఆమె శింశుపా వృక్షం క్రింద తన భర్త శ్రీ రామ నామాన్ని స్మరిస్తూ కూర్చొంది. కాని నేటి పరిస్థితుల్లో స్త్రీని ఒక కామాన్ని తీర్చగలిగే శక్తిగా మాత్రమే చూస్తూ, మూడు నెలల పాప నుండి, అరవై సంవత్సరాల ముసలి అవ్వదాకా బలైపోతున్న సంఘటనలు చూస్తున్నాం. ప్రేమ పేరుతో మోసాలు, హత్యలు ఎక్కువయ్యాయి. మన ఆలోచనా విధానంలో మార్పు రావాలి. స్త్రీని తల్లిగా చూడగలిగినప్పుడే సాధ్యమవుతుంది
- అనంతాత్మకుల రంగారావు