Tuesday, November 19, 2024

ఉత్సాహం..!

ఉత్సాహమనేది ఒక మానసిక లక్షణం. దాని సహాయంతో మనిషి విసుగుచెందకుండా, కష్టపడ్డానని అనుకోకుండా ఏ పనినైనా సాధించగలుగుతాడు. మంచి పనిమంతుడికి, ఉత్సాహం అనేది ఒక తప్పనిసరి లక్షణమని భగవద్గీతలో పేర్కొనబడింది.
”ధృత్యుత్సాహ సమన్విత:… కర్తాసాత్త్విక ఉచ్యతే” మంచి పనిమంతుడు నిలకడతనం, ఉత్సాహం అనే లక్షణాలను కలిగివుంటాడు.
ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైన వాటిలో సంతోషాన్ని ఒకటిగా వివేకానంద స్వామి పేర్కొన్నారు. ‘మీరు ఆధ్యాత్మికమైన ప్రగతి సాధిస్తున్నారనడానికి మొట్టమొదటి సూచన సంతోషంగా ఉండడమే. ఆనందంగా ఉన్నట్టు అనుభూతి చెందడం సాత్త్యిక స్వభావం. అప్పుడు అన్నీ సంతోషకరంగానే ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నారని తెలుసుకోవచ్చు. అన్ని బాధలూ తమోగుణం (తమస్సు) వల్లనే కలుగుతాయి. కనుక దాన్ని తప్పక వదిలించుకోవాలి. చిరచిరలాడుతూ, మండిపడే స్వభావం ఇతరత్రా గుణాలు తమస్సువల్ల కలుగుతాయి. బలోపేతులు, చక్కని శరీర సౌష్టవం కలిగినవారు, ఆరోగ్యవంతులు, ధైర్యవంతులు అయిన యువత వీరే యోగులు కావడానికి అర్హత కలిగినవారు.
యోగికి ప్రతిదీ ఆనందాన్నిచ్చేదే. అందరు మానవుల ముఖాలూ అతడికి ఆనందాన్ని కలిగించేవే. ధర్మాత్ముడైన మనిషికి అది ఒక లక్షణం. మన కష్టసుఖాలకు, మన శుభాశుభాలకు మనమే కారణం, ఎందుకంటే జరిగే సంఘటనలు సంఘటనలే. వాటికి ఎటువంటి భావోద్రేకాలు ఉండవు. సంతోషము, దు:ఖము ఉండవు. వాటికి ప్రతిస్పందించే మనమే దు:ఖాన్నో, సంతోషాన్నో లేక మరేవైనా భావోద్రేకాలనో పొందుతాము. వాటిని ఆ సంఘటనలకు సాధ్యమైనంత వరకు అంటగడతాం. ‘భయంకరమైన రాత్రి’ అంటే రాత్రికి ఏ గుణాలూ ఉండవుకదా! ‘భయంకరం’ అనే భావన మనలో కలిగిందే. మనం మన దినాన్ని ఎలా ప్రారంభిస్తామో అలాగే దినమంతా గడుస్తుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞానులు భావిస్తారు.
”చక్కటి ముగింపు ఉంటే అంతా బాగున్నట్టే” అనే ఆంగ్లసామెత ఉంది. కాని, మనం మాత్రం శుభారంభాలకు చాలా ప్రాముఖ్యమిస్తాం. ఉదయం మంచిరోజుకు ప్రారంభం. ఉదయం మేలుకొన్న తర్వాత మనం సంతోషంగా ప్రారంభిస్తే, ఆ రోజంతా ఇబ్బందులు వచ్చినా వాటిని చాలా నిబ్బరంగా ధైర్యంగా ఎదుర్కోగలం,
అలాకాక ప్రారంభమే చికాకుగా ఉంటే ఆ తర్వాత అతి చిన్న సమస్య కూడా మనకు ఎంతో కోపాన్ని తెప్పిస్తుంది. మన మానసిక స్థితి, మన దృక్పథం చాలా ముఖ్యమైనవి. కాబట్టి, మీ మనసుకు ధ్యానం ద్వారా శిక్షణనివ్వండి. మీ జీవితాలలోకి శాంతిని ఆహ్వానించటానికి ఉదయాలే ఉత్తమమైన సమయం.
మనం శాంతంగా ఉండాలంటే మన మనసు ఆలోచనార#హత ప్రాంతంలో ఉండాలి. ఎప్పుడూ గతాన్ని గురించిగాని, భవిష్యత్తును గురించిగాని ఆలోచించకుండా, శాంతితో, కరుణతో నిండిన జీవితాన్ని సృష్టించుకోవటానికి మనకు ప్రతి క్షణమూ అవకాశాన్నిస్తుంది. ఇతరులకోసం మనం చేయినందిస్తే అది మన ఆత్మవిశ్వాసాన్ని, అంతర్గత శక్తిని ఎంతగానో ఇనుమడింపజేస్తుంది.
ఉదయాల్లోకి, #హృదయాల్లోకి, జీవితాల్లోకి తగాదాలను ఆహ్వానించకండి. అప్పుడు ఒత్తిడికి, ఆందోళనకు లోనవుతారు. కొందరు కాఫీ, టీలతో రోజు ప్రారంభిస్తే చాలా మంది ధ్యానంతో ప్రారంభిస్తారు. మరికొందరు సంగీతం వింటారు. ఉల్లాసంగా పిల్లలతోనో, పెంపుడు జంతువులతోనో ఆడుతూ మరి కొందరు దినచర్యను ప్రారంభిస్తారు. కొందరికి నడక, వ్యాయామాలు ముఖ్యం. ఉల్లాసం కంటే ఆనందం చాలా ముఖ్యమని విజ్ఞులు చెపుతారు. ఆనందం పొందటానికి సరైన సూత్రం సమస్యలను ఎదుర్కొని పరిస్కరించుకోవటమే గాని, వాటిని మరచిపోవడం కాదు. సమస్యను సమస్యగా తీసుకుంటే, అది ఉపద్రవంగా కనిపిస్తుంది.
దానినే సవాలుగా తీసుకుంటె, దాని పరిష్కారం మేధోవికాసానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయాల గురించి ఎందరో కవులు ఎన్నెన్నో. గానాలు చేశారు. ”ప్రత్యూషం తన స్వర్ణద్వారాలను ఎలా తెరుస్తుందో, భాసిల్లే సూర్యుని నుండి తాను సెలవు ఎలా తీసుకుంటుందో చూడండి” అని షేక్‌స్పియర్‌ తన రచనల్లో అన్నాడు.

  • తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
Advertisement

తాజా వార్తలు

Advertisement