Saturday, November 16, 2024

సాయిధరమ్ తేజకు పురాణపండ జయ జయ శంకరను బహూకరించిన ఈవొ రామారావు

విజయవాడ, (ఆంధ్రప్రభ) : తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మంత్రప్రసాదానికి కనకదుర్గమ్మ కారుణ్యంతో ఏడుమాసాల క్రితం తెరలేపిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానముల డిప్యూటీ కలెక్టర్ కేఎస్.రామారావు ధార్మిక సేవ చరిత్రాత్మకమని, ఏ ఆలయానికి దైవదర్శనానికి వెళ్లినా ప్రసాదం ఇస్తారని, కానీ ఇటీవల బెజవాడ కనకదుర్గమ్మ ప్రత్యేక కార్యక్రమాల దర్శనాల్లో ముఖ్య అతిథులు, డొనేషన్స్ ఇచ్చే దాతలు, ప్రత్యేక పూజలు, అర్చనల్లో పాల్గొనే వారికి పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుతమైన గ్రంథాలను సిబ్బంది బహూకరించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇందుకు కారణమైన పురాణపండ, కేఎస్.రామారావులపై ప్రశంసలు వర్షిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలతో పాటు ఈ గ్రంథాలు శృతిగౌరవంతో తేజరిల్లుతున్నాయని ఐదుమాసాల క్రితం చాగంటి కోటేశ్వరరావు వంటి విఖ్యాత ప్రవచనకర్త కితాబివ్వడం సామాన్య విషయం కాదని అర్చక పండిత మేధో సమాజం ప్రశంసలు కురిపిస్తోంది.

సీనియర్ ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వున్నప్పుడే విఖ్యాత నటులు, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సమర్పణలో వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రచురించిన తల్లీ నిన్ను దలంచి అమ్మవారి అద్భుతమైన మంత్రరాజాల, వ్యాఖ్యానాల గ్రంథాన్ని పురాణపండ శ్రీనివాస్ రచించిన, సంకలనీకరించిన తీరు విశేషంగా ఆకర్షించింది.

ఏడేళ్ల నాటి నాటి నుండి నేటివరకు ప్రతీ ఆరునెలలకోసారి ఏదో ఒక అద్భుత గ్రంథం దుర్గమ్మ గడపని తాకుతూనే ఉంది. పురాణపండ శ్రీనివాస్.పై దుర్గమ్మ అనుగ్రహవాత్సల్యం వర్షిస్తూనే ఉంది. గత సంవత్సరం వరకూ వారాహి అధినేత సాయి కొర్రపాటి పురాణపండ శ్రీనివాస్ తో మూడు గ్రంథాలు ప్రచురించి అమ్మవారికి సమర్పించారు.

ఇటీవల వారాహి అధినేత సాయి కొర్రపాటి సుమారు ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటకలోని బళ్లారిలో పరమ శివభగవానుని శ్రీఅమృతేశ్వర ఆలయంను అద్భుత రీతిలో నిర్మించి, ఆ ఆలయం పేరిట శ్రీనివాస్ రచనా సంకలనాల్ని అక్కడి భక్త బృందాలకు పంచుతున్నారని సమాచారం.

- Advertisement -

ఈ సంవత్సరం కిమ్స్ హాస్పిటల్ చైర్మన్, శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ అందించిన అమోఘ గ్రంథాలు మంత్ర శాస్తాల కల్పవృక్షాల్లా ఉన్నాయని, శ్రీనివాస్ నిస్వార్థసేవతో ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం పలు సందర్భాల్లో అభినందించారు.

ఇటీవల బొల్లినేని కృష్ణయ్య దేవస్థానానికి సమర్పించిన మూడు విలక్షణమైన విశిష్ట దైవీయ గ్రంథాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులకు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు కృతజ్ఞతలు ప్రకటించారు.

ఈ గ్రంథాలకు సైతం రచనా సంకలనకర్త పురాణపండ శ్రీనివాసే కావడం గమనార్హం. భక్తులు గుండెలకు హత్తుకునేలాంటి మంత్ర ప్రాకార గ్రంథాలను జ్ఞానమహాయజ్ఞ కేంద్రం ద్వారా అందించడంలో అందెవేసిన చెయ్యిగా ప్రముఖ రచయిత పురాణపండ, తన పూర్వజన్మ సుకృతంగానే భుజాలకెత్తుకోగలుగుతున్నారని ఈవో రామారావు బాహాటంగా చెప్పారు.

గతంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తమ తల్లితండ్రుల జ్ఞాపకార్థం పురాణపండ శ్రీనివాస్.తో రెండు గ్రంథాలను ప్రచురించిన విషయం ఇప్పటికీ నెల్లూరు భక్తబృందాలకు గొప్ప పరిమళంగా తాకుతూనే ఉంది. ఇటీవల దేవస్థానంలో వందల సంఖ్యలో తీసుకున్న భవానీ దీక్షాధారులకు సైతం ఈవో, అర్చక ప్రముఖులు దీక్షామాల ధరించిన వెంటనే స్వయంగా ఈ పరమాద్భుత గ్రంథాలను పంచడం విశేషంగా ఆకట్టుకుంది.

బొల్లినేని కృష్ణయ్య ఇటీవల అమ్మ వారి దర్శనానికి వచ్చినప్పుడు కొందరు అధికార, అనధికారులు స్వయంగా ఈ గ్రంథాలను పంచారు. గురువారం అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకున్న ప్రముఖ చలనచిత్ర కథానాయకుడు సాయి ధర్మతేజ్ కి దర్శనానంతరం ఈవో రామారావు కార్తీక మాసపు కానుకగా పురాణపండ శ్రీనివాస్ జయ జయ శంకర శైవ సౌందర్యాల అక్షర మారేడుదళాల అమోఘ గ్రంథాన్ని బహూకరించారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో నిరాఘాటంగా భక్తులకు ప్రసాదంతో పాటు మంత్రప్రసాదంగా బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో ఈ గ్రంథరాజాలను బహూకరించడం చరిత్రకెక్కే అంశంగా మేధో సమాజం పేర్కొంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement