పవిత్ర మాఘ మాసాన్ని పురస్కరించుకుని, శ్రీ మహావిష్ణువు స్మరణలో స్థానిక నల్లకుంట శ్రీ శృంగేరి శంకర మఠం ప్రాంగణములో అన్నమయ్య పరివారము, ఎస్. పి. నగర్, మౌలాలి, హైదరాబాద్ వారి నిర్వహణలో, శ్రీ శృంగేరి శంకర మఠం వారి సౌజన్యంతో ది. 25-02-2024 ఆదివారము నాడు ”అన్నమయ్య సంకీర్తన మాధుర్యం” భక్తి సంగీత కార్యక్రమము ఆసాంతము కన్నుల పండువగా జరిగినది.
‘అన్నమయ్య సంకీర్తన చూడామణి’ శ్రీమతి ఎన్. సి. శ్రీదేవి (తిరుపతి) తమ మధురగానంలో పాడిన ‘శ్రీమన్నారాయణ’, ‘దేవా నమో దేవా ‘, ‘నీ నామమే మాకు’, ‘ఇట్టివాని నన్ను’, ‘కొమ్మా నీ చక్కదనము’, ‘మూసిన ముత్యానకేలే’, ‘ఏమని పొగడుదుమే’, ‘రాముడీతడు’, ‘వెన్నముద్ద కృష్ణుడు’, ‘అదివో అల్లదివో’ మొదలగు సంకీర్తనలతో పాటు శ్రీమతి స్నేహాంకిత ఆలపించిన ‘అంతయు నీవే హరిపుండరీకాక్ష’, ‘ఇందరికి అభయమ్ము లిచ్చుచేయి’, ‘తెలిసితే మోక్షము’ కీర్తనలు స్వామి భక్తులను ముగ్ధులను చేసాయి. చివరగా శ్రీమతి శ్రీదేవి గానము చేసిన ‘’చూడరమ్మ సతులాలా’ సంకీర్తనతో స్వామివారి ఉభయ దేవేరులకు మంగళ నీరాజనాలు అర్పించటంతో కార్యక్రమము ముగిసినది.
తిరుపతి అన్నమయ్య ప్రాజెక్ట్ కళాకారులు సర్వశ్రీ ఎన్. బాలాజీ (కీబోర్డ్), పి. పాండురంగారావు (తబలా), పి. సురేష్ (రిథమ్స్) చక్కటి వాద్య సహకారమును అందించి శ్రోతల ప్రశంసలను అందుకొన్నారు.
అన్నమయ్య పరివారము వ్యవస్థాపకులు యనమండ్ర వెంకట కృష్ణయ్య, సభ్యులు కందుకూరి సుబ్రహ్మణ్యం, వై. పురంధర్, కాండూరి శ్రీలక్ష్మి, కె. ఎన్. సంగీత ; శంకర మఠం శాఖాధిపతి కె. కృష్ణారావు; ప్రముఖ వాగ్గేయకారులు నల్లాన్ చక్రవర్తి మూర్తి , సీనియర్ పాత్రికేయులు జి. వల్లీశ్వర్ తదితరులు పాల్గొని చివరలో కళాకారులను ఘనముగా సత్కరించారు.