Saturday, January 4, 2025

…జ్ఞానానుభూతి!

మానవ సృష్టి అనాగరిక జాతులతో కాకుండా పరమ గురువులతో ఆరంభమయినదని భారతీయ విజ్ఞానం చెపుతున్నది. మానవుడు పరిచ్ఛిన్నుడు అనగా పరిమితులకు లోబడినవాడు.. భగవంతుడు అపరిచ్ఛిన్నుడు. పరిమితులకు అతీతుడు. పరిమితులకు లోబడిన మానవుని జీవనగమనంలో ఎదురయ్యే ఎన్నో ఒత్తిడులు, సమస్యల మూలంగా అవగాహన లోపించి వాటి పరిష్కారానికై అనాదిగా జ్ఞానవంతులైన ఇతరులపై ఆధారపడడం కనిపిస్తున్నది.
సాధారణంగా జ్ఞానమనేది ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి చేరేందుకు మార్గం చూపుతుంది. అలాంటి జ్ఞానము రెండు విధాలుగా చెప్పబడుతుంది. మొదటిది.. అనాదిగా ప్రకృతిలో లయమై ఉన్న విజ్ఞానకోశాన్ని ఋషులు తమ అలౌకిక ధ్యాన స్థితిలో దర్శించి వాక్కురూపంలో అందించిన వేదాదులు, ఉపనిషత్తుల జ్ఞానం. వీటిని ఋషిప్రోక్తాలని, అపౌరుషేయాలని చెపుతారు. దానిపై ఏ వ్యక్తియొక్క వ్యక్తిత్వ ప్రభావం ఉండదు. రెండవది.. విజ్ఞానులైన వారు, వేదాదుల నాధారం చేసుకొని, బుద్ధిని మథించి ప్రవచించిన జ్ఞానము, ఇవి పురాణాదుల రూపంలో వెలుగుచూసాయి. ఇందులో ఆయా పండితుల వ్యక్తిత్వ ప్రభావం ప్రతిబింబించే అవకాశము ఉన్నది. వేదాదులు.. అందరూ సుగమంగా అవగాహన చేసుకోదగినవే అయినా పండితులు వారివారి భావనల కనుగుణంగా, దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. వ్యాఖ్యానాలు చేయడంతో సదవగాహనకు అవి దూరమయ్యాయి. పురాణాలలో కూడా భారతంలాంటి గ్రంథాలకు విజ్ఞానం ప్రధానమైనది కాగా, భాగవతంలాంటి వాటికి అనుభూతి ప్రధానమైనది. కష్టజీవులకు కావలసినది నిజానికి అనుభూతియే.
మహాభారతంలో అర్జునుడు జ్ఞానవంతుడే. ధర్మతత్త్వాన్ని తెలిసినవాడే. కర్తవ్య నిర్వ#హణా దక్షుడే. అయినా యుద్ధరంగంలో విమో#హతుడై కర్తవ్యాన్ని ఉపదేశించమని కృష్ణుని వేడుకున్నాడు. కృష్ణుడా సమయంలో ఉపదేశించిన బోధ, అర్జునునికి మాత్రమే పరిమితం కాకుండా అనాదిగా గీతాబోధగా లోకానికి మార్గదర్శన చేస్తున్నది.
ఉపనిషత్తులు… వైరాగ్య భావనను కలిగిన జిజ్ఞాసువులు శ్రద్ధాసక్తులు గలిగి, అర్హులైన గురువుల సమక్షంలో, ప్రశాంతమైన వాతావరణంలో, సర్వ సమర్పణా భావనతో, విప్పారిన మనస్సుతో వినేందుకు సన్నద్ధమైన సమయంలో ఉపదేశింపబడితే…
భగవద్గీత… సమాజమనే యుద్ధరంగంలో, నిత్యమూ భయమూ, శోకమూ, మోహమూ అనే యోధులతో పోరాడుతూ నిలకడలేక, మానసిక స్థైర్యం చెదిరిపోగా.. అస్త్రశస్త్రాలను విడిచిపెట్టి చతికిలబడ్డ సాధారణ వ్యక్తిని సంపూర్ణ కర్తవ్య దీక్షాబద్ధుడిని చేసేందుకు అవసరమైన స్థైర్యాన్ని, శక్తిసామర్ధ్యాలను, మనోధైర్యాన్ని ఇవ్వడానికి ప్రబోధించబడినది.
ఉదాత్తమైన కార్యాన్ని నిర్వహించాల్సిన సమయంలో అర్జునునిలో కలిగిన ఆవేదన, వ్యామోహాదులు అతనికి మాత్రమే పరిమితం కావు, సకల మానవాళికి సంబంధించినవి. కురుక్షేత్రంలాంటి జీవన సమరంలో విభ్రాంతులైన సకల మానవుల సమస్యలకు అర్జునుడు ప్రతీకగా నిలిచాడు. అర్జునుని ప్రశ్నలే జిజ్ఞాసతో కూడిన మనందరి ప్రశ్నలు. అతని ఆవేదనయే సమస్యలనే సముద్రాన్ని దాటాలనే తపనలో మనందరమూ పడుతున్నా ఆవేదన. అర్జునుని తాపత్రయాన్ని అడ్డం పెట్టుకొని, సకల జనుల తాపత్రయాలను దూరం చేసేందుకు
కృష్ణపరమాత్మ ఇచ్చిన దివ్య సందేశమే గీతాబోధ. ఋషుల సత్యదర్శనమైన ఉపనిషత్తుల సారంగా గీత ఆవిష్కృతమయింది.
ప్రతివ్యక్తీ భగవంతుని ప్రతిరూపమే. జ్ఞానమనేది అందరిలోనూ నిక్షిప్తమయి ఉన్నది. అయితే మాయ, అహంకారాలనే ముసుగులచే కప్పబడిన కారణంగా సత్యాన్ని దర్శించడం సాధ్యపడడంలేదు. స్వచ్ఛమైన నీటిపై నాచు కప్పబడింది. పవిత్రమైన నిప్పు బూడిదచే కప్పబడింది. నాచు, బూడిదలు అజ్ఞానమనే చీకట్లకు ప్రతీకలు. ఒకసారి అవి తొలిగిపోతే… జ్ఞానప్రకాశం దర్శనమిస్తుంది. దానికి సహకరించేవే.. ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత లాంటి గ్రంథాలు. వాటిని శ్రద్ధతో ఆధ్యయనం చేసి ఉదాత్తమైన మానవ జన్మను సార్ధకం చేసుకోవడమే మానవ జన్మకు ప్రయోజనం.

  • పాలకుర్తి రామమూర్తి
Advertisement

తాజా వార్తలు

Advertisement