Tuesday, November 26, 2024

అజ్ఞానపు భ్రమలు తొలగించేదే…గీతాశాస్త్రము

శ్రీ భగవాన్‌ ఉవాచ

కచ్చిదేతఛ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా?
కచ్చిద జ్ఞాన సమ్మోహ: ప్రణష్టస్తే ధనంజయ??

(శ్రీమత్‌ భగవద్గీత 18వ అధ్యాయం 72వ శ్లోకం)
తాత్పర్యం: ఇప్పటిదాకా అర్జునుడికి గీతను బోధించిన కృష్ణుడు ఈ కింది ప్రశ్న వేసాడు. ఓ అర్జునా! ఇప్పటి దాకా నేను చెప్పింది ఏకాగ్రమైన మనసుతో విన్నావు కదా! ఏమైనా అర్థం అయిందా! ఒంటబట్టిందా! మొట్టమొదట నీలో పుట్టిన నీ అజ్ఞానము నశించిందా! నేను అందరినీ చంపుతున్నాను అన్న మోహం పోయిందా! నీ భ్రమలు అన్నీ తొలగి పోయాయా! అని అడిగాడు.
వివరణ: ఏకాగ్రచిత్తంతో విన్నావా అని అడగడంలో పరమాత్మ ఉద్దేశం, తరువాతి తరా ల వారు ఈ గీతను వినేటప్పుడు ఏకాగ్రచిత్తంతో వినాలి. మనసు ఎక్కడో పెట్టుకొని శరీ రం గీతాప్రవచనం జరిగేచోట ఉంచకూడదు. ఆ మాటకొస్తే గీతాప్రవచనమే కాదు ఏ పని చేసినా, పూజ, వ్రతము చేసినా ఏకాగ్రచిత్తంలో చేయాలి అనే విషయాన్ని అర్జునుడిని అడ గడం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏ పనిచేసినా ఏకాగ్రచిత్తంతో, మనసు పెట్టి చేయాలి కానీ అన్యమనస్కంగా చేయకూడదు. ధ్యానం చేసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, దేని గురించైనా విచారణ చేసేటప్పుడు కానీ, మనస్సు నిలిపి చేయాలి. ఏకాగ్రచిత్తంతో చేయాలి. చంచలమైన మనస్సు ఉండకూడదు.
మనం గీతను చదవడం, వినడం, అధ్యయనం చేయడం, పూజలు, వ్రతాలు చేయడం అన్నీ కూడా మన లోపల ఉన్న అజ్ఞానాన్ని నాశ నం చేసుకోడానికే. ప్రవృతి మా ర్గంలో నుండి నివృతి మార్గంలోకి మళ్ల డానికే. అదే ఇక్కడ అన్నాడు కృష్ణుడు. ఈ గీతా శాస్త్రము విన్న తరువాత నీలోని అజ్ఞానము మోహము భ్రమలు నశించాయా అని అడిగాడు.
ఈ శ్లోకంలో అర్జునుడిని సంబోధన కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ధనంజయ అంటే రాజసూయ యాగములో అందరి రాజులను జయించి ధనరాసులను సంపాదించాడు. అలాగే ఇప్పుడు కూడా నీలో ఉన్న కామ క్రోధములను, మోహమును జయించి, జ్ఞానము అనే ధనమును సంపా దించావా అని అడిగాడు కృష్ణుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement