యాకుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతిభి:ర్దేవై సదా వందితా
సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేష జాడ్యాపహా:!
భారతీయ సనాతన ధర్మము ఆధ్యాత్మికతకు ఆలంబము. ఇది లోకోద్ధరణకు, మానవ కళ్యాణానికి ఉద్దేశింపబడినది. భార తీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఈ జగత్తు యావత్తు ఒకే మూల శక్తియైన పరమాత్మ నుండి యావిర్భవించి, వివిధ అంశ లతో వివిధ అవతారాలను దాల్చి, కాలానుగుణంగా, సందర్భాను సారంగా, లోక నిర్మాణ, నిర్వహణపరంగా భిన్నత్వంలో ఏకత్వం ప్రతిపాదిస్తున్నది. పరమాత్మ ప్రధానంగా సృష్టి, స్థితి, లయ నిర్వహణ కొరకై బ్రహ్మ, విష్ణు, శివ రూపాలు ధరించి తన లీలావిలాసాలను కొన సాగిస్తున్నాడు. సకల సృష్టి ప్రకృతి పురుషుల సమ్మేళనము. ఈ సిద్ధాం తములో బ్రహ్మకు సరస్వతీ దేవి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవి, శివునకు పార్వతీదేవి సహచరులుగా తమతమ విభూతులను ప్రకటిస్తున్నారు.
‘శ్రీ’ అనే శబ్దం శక్తి స్వరూపాన్ని వివరిస్తుంది.’విద్’ ధాతువునుండి విద్యాశబ్దం ఏర్పడుతోంది. దీని ముఖ్యార్థం జ్ఞానము. జ్ఞానాన్ని పర బ్రహ్మ రూపంగా కూడా చెప్పుకోవచ్చు. సకల శుభకార్యాలందు ”దేవీం వాచమజనయన్త దేవా:” అనే ఋగ్వేదమంత్రంతో ప్రారంభి స్తారు. అంటే శుభ కార్యక్రమానికి ముందుగా వాక్కునకు నమస్కరి స్తారు. ఉచ్ఛారణా దోషాలు కలుగకుండా ప్రార్థన చేస్తారు. ఉచ్ఛారణా దోషాలు లేని వాక్కు అద్భుత ఫలితానిస్తుంది.
పరమాత్మ తత్వాన్ని గ్రహించటానికి పరమాత్మ జ్ఞానము అవస రం. జ్ఞాన సముపార్జనకు మానసిక ఏకాగ్రత ముఖ్యము. మానసిక ఏకాగ్రతకు ధ్యానము ప్రధానము. ధ్యానానికి విద్య మూలం. విద్య అంతర్ముఖ, బహర్ముఖ ఉద్దీపన కలుగచేస్తుంది. సకల కళలకు, విద్యకు అధిదేవత సరస్వతీదేవి.
వివిధ పురాణాలలో సరస్వతీ ఆవిర్భావం గురించి వివిధ కథనాలు కనబడతాయి. గాయత్రీ ఉపాసనలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కన బడుతుంది. సరస్వతీదేవిని గాయత్రిమాతగా భావిస్తూ ప్రార్థన చేస్తారు. అగ్ని కార్యక్రమాలలో కూడా సరస్వతీదేవి ప్రార్థన కనిపిస్తుంది. ఋగ్వేదంలో కూడా సరస్వతీదేవి ప్రస్తావన కలదు. ఈవిధంగా సరస్వతీదేవి ప్రస్తావన అన్ని జ్ఞాన సముపార్జన కార్యక్రమాలలో, పితృకార్యములలో, దేవతాపూజా విధానాలలో కనిపిస్తుంది.
సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. ఆమె వీణ ధరించి, పుస్తకం చేబూని, హింసవాహనముపై ధవళవస్త్రాలంకరణలో, నిర్మలంగా, ప్రశాంతంగా దర్శనమిస్తుంది. ”హంస”ను పరబ్రహ్మంగా కీర్తిస్తారు. పద కవితా పితామహుడైన అన్నమాచార్యుడు శ్రీవేంకటేశ్వరుని హింసగా అభివర్ణిస్తాడు. ”దిబ్బలువెట్టుచు దేలినదిదివో ఉబ్బునీటిపై నొక హింసా…..”, ”పాలు నీరు నేర్పరచి పాలలో నోలాడె నిదె వొక హింసా…..” అంటూ సంకీర్తన ఆలపించాడు. హింసకు పాల నుండి నీటిని వేరుపరచే అద్భుతమైన శక్తివుంది. అంటే మంచిని గ్రహించి, చెడును విస్మరించటం అని దీని అర్థం. ”సరస్వతి” అనే పదం ”తనను తాను తెలుసుకునే శక్తి” అని కూడా చెప్పవచ్చును. ఈ శక్తి జ్ఞానులకు మాత్రమే సాధ్యం.
జ్ఞానానికి, సర్వ కళలకు అధిదేవతైన శ్రీ సరస్వతీదేవి మాఘ శుద్ధ పంచమినాడు జన్మించినట్లుగా చెబుతారు. మాఘమాసం శిశిర ఋతువులో వచ్చినప్పటికి, వసంత ఋతువుకు స్వాగత సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజును శ్రీపంచమి, మదనపంచమి, వసంత పంచమి అంటారు. ఈరోజు వయోబేధం లేకుండా అందరూ సరస్వతీ పూజలు చేస్తారు. ముఖ్యంగా పిల్లలచేత పూజలు చేయిస్తారు. దీనివలన వారికి మంచి విద్యాబుద్ధులు అలవడతాయని నమ్మకం. ఉదయాన్నే కాలకృత్యాలు నెరవేర్చుకుని, అభ్యంగనస్నాన మాచరించి, మంచి దుస్తులు ధరించాలి. గృహమును మామిడి ఆకులతో, పుష్పాలతో అలంకరించాలి. పూజాగృహమును కూడా శోభస్కరంగా అలంక రించాలి. సరస్వతీదేవిని ఉచితాసనముపై ప్రతిష్టించి, సుగంధ ద్రవ్యముతో అభిషేకించి, చక్కని వస్త్రాలంకతిని చేసి, తాజా పుష్ప ములతోను, మంచి గంధముతోను, ధూప దీపములతో షోడశోప చారములతో పూజనిర్వహించాలి. పూజలో పిల్లల పుస్తకాలు, కలము మొదలగువాటిని ఉంచి పూజచేయాలి. తరువాత ఆమెకు ప్రీతి పాత్రమైన మధురపదార్థములు నివేదనచేసి, నీరాజన మంత్ర పుష్ప ముల సమర్పించాలి. సకల విద్యలు అలవడుటకై భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేయాలి. ఇదే రోజున పిల్లల చేత అక్షరాభ్యాసము కూడా చేయిస్తారు.
మనదేశంలో అనేక ప్రసిద్ధ సరస్వతీ క్షేత్రాలున్నాయి. అదిలాబాద్ జిల్లాలోని బాసరలో జ్ఞానసరస్వతీ ఆలయం, కాశ్మీరులోని శారదాదేవి ఆలయం, నల్గొండ జిల్లాలోని అడ్లూరి గ్రామంలోని సరస్వతీ ఆలయం, కర్ణాటకలోని శృంగేరిలో శ్రీశంకరాచార్య ప్రతిష్టిత సరస్వతీ ఆలయం మొదలైనవి ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు.
ఈరోజును మదన పంచమిగా కూడా రతీమన్మధులను పూజి స్తారు. దీనివలన దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయని నమ్మిక. సరస్వతీ పురాణంలో దక్షిణామూర్తి, బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు, శ్రీరాముడు, గణపతి, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, ఇంద్రుడు, సూర్యుడు, శంకరాచార్యుడు మొదలైనవారు స్తుతించిన స్తోత్రాలు కనబడతాయి.
సరస్వతీదేవి కరుణతో విశేష జ్ఞానము, వాక్సుద్ధి, మంత్రసిద్ధి, ధారణాసిద్ధి, మేధాసిద్ధి కలిగి సర్వత్రా జయప్రదం కావాలని ఆకాం క్షిస్తూ ప్రార్థన చేద్దాం.
డా. దేవులపల్లి పద్మజ
9849692414