Monday, November 18, 2024

తిరుమ‌ల హుండీ ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసా?

తిరుమ‌ల‌, ప్ర‌భ న్యూస్: తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకుని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ఆల‌యంగా తిరుమల దేవ‌స్థానం ప్రసిద్ధి కలిగింది.

ఆదాయానికి ఒక లెక్కాపద్దు ఉండాలనే యోచనను తొలిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది. 1821 జులై 25న హుండీని ఏర్పాటు చేశారు. ఒక గంగాళాన్ని తీసుకుని దాని చుట్టూ తెల్లటి వస్త్రాన్ని కప్పేసి పైకి కడతారు. దానికి వేంకటేశ్వర స్వామి తిరునామాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదే కాలక్రమేణా హుండీగా పరిగణలోకి వచ్చింది. ఎలా లెక్కించాలి. ఎలా కొప్పెరను దించాలనే అంశంపై ఓ ప్రత్యేక చట్టాన్నే ఏర్పాటు చేశారు.

తిరుమల ఆలయానికి ఉన్న ప్రాచీనమైన చరిత్రలో చాలాభాగం ఆయన హుండీకి కూడా ఉంది. దేవాలయవ్యవస్థ బలపడ్డాకా హుండీ, కానుకల చెల్లింపు వంటివి చాలా ప్రాచుర్యం పొందాయి. స్వామి వారి హుండీ ఆదాయం 18వ శతాబ్దం నుంచీ కూడా ఎక్కువగానే ఉండేది. 1830ల్లోనే తిరుమల ఆదాయం, అందులోనూ ప్రధానంగా హుండీ ఆదాయం నుంచి పూజలకు, అర్చనలకు, ఉత్సవాలకు ఖర్చులు పోగా ఆనాటి ప్రభుత్వమైన ఈస్టిండియా కంపెనీకి దాదాపు రూ.లక్ష మిగులు ఉండేది. ఇది 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఒక ప్రార్థనామందిరం నుంచి ఊహించేందుకు వీలులేనంత భారీమొత్తమే.

తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తుల్లో ఉన్న వడ్డీకాసులవాడు, ఆపదమొక్కులవాడు వంటి పేర్లు ధనరూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవడాన్ని సూచిస్తాయి. పౌరాణిక గాథల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బులేకుంటే పెళ్ళిఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మిదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపదలేకపోయింది. పెళ్ళికి అవసరమైన డబ్బు కుబేరుడు వేంకటేశ్వరునికి అప్పుపెట్టారు. వేంకటేశ్వరస్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి.
ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని నమ్మిక. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటుంటారు. శంకరాచార్యులవారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ క్రింద ‘శ్రీచక్రం’ ప్రతిష్టించారని ఒక ప్రతీతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement