Saturday, November 23, 2024

అవాస్తవాలు నమ్మకండి

సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు చెప్పలేదు
టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

-తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవేంకటేశ్వ రస్వామి వారి సేవా టికెట్ల జారీలో వీఐపీల ఒత్తిడిని తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో పాలకమండలి సమావేశంలో జరిపిన చర్చను వక్రీకరించి కొంత మంది తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుండడం దౌర్భాగ్యమని టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాలకమండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలనే అభిప్రాయంతోనే ఎస్వీబీసీలో లైవ్‌ ఇస్తున్నామని తెలిపారు. నాలుగు గోడల మధ్య కూర్చుని రహస్యంగా తాము ఈ అంశం చర్చించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ ప్రారంభంలోనే సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్ల ధరలు పెంచడం లేదని తాను స్పష్టంగా చెప్పిన మాటలు విమర్శకుల చెవులకు వినిపించకపోవడం తమ తప్పు కాదని తెలిపారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా తాను ఈ విషయం చాలా సూటిగా స్పష్టంగా ఒకటికి రెండుసార్లు చెప్పిన వీడియో రాజకీయ ఆరోపణలు చేసే వారి కళ్ళకు కనిపించకపోవడం పాలకమండలి తప్పు కాదని వివరించారు. సామాన్య భక్తులకు కేటాయించే టికెట్ల ధరలు పెంచుతున్నామని, పెంచేశామని, తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల్లో ఆందోళన రేపే ప్రయత్నాలను శ్రీ వేంకటేశ్వరస్వామివారు సఫలం కానివ్వరనే విషయం వారు గుర్తించాలని తెలిపారు. దేవుని కూడా రాజకీయాల్లోకి లాగి రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేసే కుట్రదారులకు స్వామివారే తగిన శిక్ష విధిస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే ఇలాంటి శిక్ష అనుభవిస్తున్న వారు ఇకనైనా తెలివి తెచ్చుకోవాలని సూచించారు. తమ పాలకమండలి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోదని తెలిపారు. భక్తులకు మేలుచేసే సద్‌ విమర్శలని తాము ఎప్పుడూ స్వాగతిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని ప్రజల్లో అభిప్రాయం కలిగించేందుకు జరుగుతున్న రాజకీయ కుట్రను భక్తులు గ్రహించాలని ఆయన కోరారు. తాము, సభ్యులు పాలకమండలి సమావేశంలో మాట్లాడిన మాటలని సాంకేతిక పరిజ్ఞానంతో వారికి కావాల్సిన విధంగా ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ వాస్తవం..
అర్జిత సేవా టికెట్ల ధరల పెంపుపై చాలాకాలంగా చర్చ జరుగుతోందని, సేవా టికెట్లు పరిమితంగా ఉండగా, సిఫారసు లేఖలు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయని ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. సిఫారసులను తగ్గించేందుకు విచక్షణ కోటాలో ఉన్న సేవా టికెట్ల ధరలను పెంచితే ఎలా ఉంటుందనే విషయంపై చర్చ మాత్రమే పేర్కొన్నారు. సామాన్యులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలనే ఆలోచనే లేదని తెలిపారు. వీఐపీల ప్రయోజనాలను కాపాడి సామాన్య భక్తుల ప్రయోజనాలను దెబ్బతీయాలనుకుంటున్న వారే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement