Wednesday, November 20, 2024

బ్రహ్మాస్త్రం హనుమను బంధించలేదా

హనుమంతుడు అశోకవనంలో వున్న సీతను చూసి, రాముడి గుర్తుగా అంగుళీయకం ఇచ్చి, సీత గుర్తుగా చూడామణిని తీసుకుని, ఆమె దగ్గర శలవు తీసుకుని వెళ్లిపోయాడు. ”తనకు శుభమగుగాక, విఘ్నాలు కలగకుండా వుండుగాక!” అని సీతాదేవి అనడంతో, ఇంకా చేయాల్సిన పని కొంచెం మిగిలుంది అనిపించింది హనుమకు. సీతను వెతకమనీ, లంకను చూడమనీ, సుగ్రీవుడు తనకు రెండు పనులప్పగించాడు. సీతను వెతకడం అయిపోయింది. లంకను చూడటమంటే, రాక్షసుల బలాబలాలు బేరీజు వేయడం, రావణుడి అభిప్రాయం తెలుసుకోవడం. ఇదిచేయాలంటే, సామ- దాన- భేదాలు పనికిరావు. దండోపాయమొక్కటే సరైన మార్గమనుకుంటాడు. రామలక్ష్మణులు సహాయం లేనివారు, ఏమీ చేయలేరని దురభిప్రాయంతో వున్న రాక్ష సుల అపోహ తొలగించాలంటే, సుగ్రీవుడి సహాయముందని ప్రకటించి, యుద్ధం చేసి, కొంద రినన్నా చంపాలని అనుకుంటాడు. అప్పుడు మిగిలినవారు ద్వేషం వదిలి మెత్తబడటమో, వారిలో వారికి విభేదాలు రావటమో జరుగుతుంది. తాను కొందరిని చంపితే రామచంద్ర మూర్తి పని సులభం కావచ్చు. సీతాదేవి ఏం చెప్పింది? రాముడే రావాలి, రావణాదులను చంపాలి, తనను తీసుకునిపోవాలని కదా! ఈ సంగతి చెప్పటమంటే రాక్షసుల బలాబలాల విచారణ జరగాలనే! అనుకున్నాడు.
ఏదోవిధంగా, రావణుడిని, వాడి మంత్రులను, సైన్యాన్ని, యుద్ధ³ానికీడ్చి, దాంతో శత్రు వుల బలాబలాలను తెలుసుకుని, వాడి ఆలోచనేమిటో అర్థం చేసుకోవటమే మంచిదనుకుం టాడు. గొప్పగొప్ప వృక్షాలతో, అందమైన తీగలతో వున్న అశోకవనం ధ్వంసం చేస్తే రావణుడి కి కోపం వస్తుంది. అప్పుడు రావణుడికి కోపం వచ్చి ఏనుగులతో సహా తన సైన్యాన్ని యుద్ధానికై తన మీదకు పంపుతాడు. వాళ్లను తునాతునకలు చేసి కిష్కింధకు వెళతాను.

ఇలా ఆలోచించిన హనుమం విజృంభించాడు. చెట్లన్నీ పెళ్ళగించాడు. ప్రమదావనాన్ని పాడు చేసాడు. క్రీడాపర్వతాలను నేలమట్టం చేసాడు. క్రీడాసరస్సులను విరగగొట్టాడు. ఆ వనం కార్చిచ్చు తగిలి కాలిపోయినట్లయింది. రావణాసురుడి భార్యలకు ప్రమదావనమైన ఉద్యానవనాన్ని నాశనంచేసి, కయ్యానికి కాలు దువ్వి, యుద్ధానికెదురు చూస్తూ ఆ వనం తలవాకిటి మీద కూర్చు న్నాడు హనుమంతుడు. సీతకు కాపలాగా వున్న రాక్షస స్త్రీలు దీనికి భయపడి పరుగు-పరుగున రావణుడికి చెప్పటానికి వెళ్లారు. ”భయంకరమైన వానర రూపంకల వీరుడొకడు సీతతో మచ్చికగా ముచ్చట్లాడి, అశోకవనంలో వున్నాడు. వాడు సీతను వెతికేందుకు వచ్చిన శ్రీరాముడి దూతో, కాదో, తెల్సుకోవడం కష్టంగా వుంది” అని విన్నవించుకున్నారు రావణుడికి. ”నీ వనాన్ని పాడు చేసినందుకు, సీతను పలుకరించినందు కు, కోతి పొగరు అణిగేటట్లు కఠినంగా దండించు. నువ్వు కోరికపడ్డ ఆడదానితో మరొ కరొచ్చి మాట్లాడితే ఎవరైనాసరే ప్రాణాలతో వుండవచ్చా?” అని రెచ్చగొట్తారు రాక్షసులు.
ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడు రావణుడు. తనతో సమానమైన కింకరులను ఆ కోతిని పట్టుకునిరమ్మని పంపుతాడు. ఆ కింకరులు ఆయుధాలు, ఖడ్గాలు ధరించి, యుద్ధ కాంక్షతో, హనుమంతుడి మీదకొస్తారు. వారిని చూసి ”దృఢపరాక్రమం కల శ్రీరామచంద్ర మూర్తికీ, లక్ష్మణుడికీ, రామలక్ష్మణుల రక్షణలో వుండి, తెంపు, పరాక్రమం గల వానరనాధుడు సుగ్రీవుడికి, జయంకలుగుకాక… జయంకలుగుకాక” అని స్మరిస్తాడు హనుమంతుడు. (జయ త్సతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల: దాసోహం కోసలేంద్రస్య! నరావణ సహస్రం మే యుద్ధె ప్రతిబలం భవేత్‌- వీటిని జయ మంత్రాలంటారు. సర్వకార్య సిద్ధికి ఈ శ్లోకా లను జపించమన్నారు పెద్దలు. ఇవి నిత్య మూ పఠించేవారిపై క్షుద్రశక్తులు పనిచేయ వని అంటారు) సమస్త కళ్యాణ గుణాలవల్ల మనోహరుడైన కోసలదేశ ప్రభువైన రామ చంద్రమూర్తికి తాను దాసుడననీ, శత్రు సంహారకుడైన వాయు పుత్రుడననీ, హను మంతుడన్న పేరుకలవాడిననీ, వేయిమంది రావణులైనా తనతో యుద్ధంలో సరితూగ రనీ, రాళ్లతో, చెట్లతో శత్రువులను సంహరి స్తాననీ గర్జిస్తాడు. లంకను ధ్వంసం చేసి, రాక్షసులందరినీ హింసించి వెళ్తానని అరుస్తాడు.

తన మీదకు వచ్చిన కింకర రాక్షసులందరినీ చంపి, ఇంకా యుద్ధం చేయాలన్న కోరికతో, రాక్షసులకు భయంకరంగా కనిపిస్తూ, మళ్లి తోరణమెక్కి కూర్చు న్నాడాయన. అప్పుడు ప్రహస్తుడి కొడుకును యుద్ధానికి పంపుతాడు రావణుడు. వాడిపేరే ”జంబుమాలి”. కింక రులందరినీ చంపిన హనుమంతుడు, మేరుపర్వత శిఖరంతో సమానమైన ఓ మేడను చూసాడు. అది గట్టిగా వూగిపోయేటట్లు దానిమీదకు దూకుతా డు. చూడటానికి ప్రాసాదంలాగా వున్న ఆమేడ లంకాధిదేవత గుడి. ఆ మేడంతా విరగ్గొట్టి, ‘స‌జయం – జయం రాముడి”కి అని స్మరిస్తూ, వేయిమంది దశకంఠులు కూడా ఒక్క హనుమంతుడికి సరికాదని గర్జిస్తాడు.

హనుమ సింహనాదాన్ని విన్న దేవాలయ కాపలాదారులు (చైత్యపాలకులు), ఆయన్ను చుట్టుముట్టారు. కావలి రాక్షసు లందరినీ చంపి, ఆకాశంలోకి ఎగిరి, అందరికీ వినపడేటట్లు గట్టిగా ”ఓ లంక వాసులారా! వినండి. నాలాంటి వేలాది వానరు లు సుగ్రీవాజ్ఞ ప్రకారం సీతాదేవిని వెతుకుతున్నా రు. వాళ్లంతా నాలాగా బలవంతులే! పది ఏనుగుల బలం, నూరేనుగుల, వెయ్యేనుగుల బలమున్న వారు, చెప్పలే నంత బలవంతులే. వాయువేగంతో పోగ లిగేవారు ఎంతోమంది వున్నారు వాళ్లలో. వీళ్లందరి ఆయు ధాలు గోళ్లు, దంతాలు, రాళ్లే! ఇలాంటి కోటానుకోట్ల వానరు లను తీసుకుని, సుగ్రీవుడు రాబోతున్నాడు. మిమ్మల్నందరినీ చంపబోతున్నాడు. శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నారు. రావణుడికీ లంకకూ, మీకూ ఇక రుణానుబంధం తీరినట్లే!”
ఇంతవరకు సీతను లంకలో వుంచిన వార్త అంత:పురానికి వచ్చేవారికి తప్ప ఇతరులకు తెలియదు. హనుమ గట్టిగా చెప్పడంతో ఇప్పుడు అందరికి తెలిసింది. రహస్యం బయట పడింది. అప్పుడు ప్రహస్తుడి పుత్రుడు జంబుమాలి అక్కడకువేగంగా వచ్చాడు. హనుమ వేసిన ఒక ఇనుప గుండుదెబ్బకు, జంబుమాలి పొడిపొడిగా, ముక్కలు చెక్కలై నేలకూలాడు. కింకరులు జంబుమాలి చచ్చాడని రావణుడికి తెలిపారు. రావణుడు, ఏడుగు రు మంత్రి పుత్రులను పంపాడు హనుమంతుడి మీదకు. వచ్చినవాళ్లను అరిచేతుల్తో, కాళ్లతో కొట్టి, గోళ్లతో చీల్చేసాడు. మంత్రికుమారుల మరణవార్త విన్న రావణుడు తన ఐదుగురు సేనానాయకులైన, విరూపాక్షుడు, దుర్ధరుడు, యూపాక్షుడు, భాసకర్ణుడు, ప్రహసుడు అనే వారి ని పిల్చి, సైన్యంతో వెళ్లి, కోతిని పట్టుకుని తెమ్మంటాడు. వారందరినీ చంపాడు హనుమ.
తన ఐదుగురు సేనానాయకులు, మరణించారన్న వార్త విన్న రావణుడు, అక్షుడనే తన కొడుకును యుద్ధానికి పంపుతాడు. అక్షుడు, బలవంతుడైన హనుమంతుడిని సగౌరవంగా చూసి, యుద్ధానికి దిగాడు. ఆంజనేయుడు తన చూపులతోనే అక్షకుమారుడి సేనలను దగ్ధం చేసాడు. వాడి యుద్ధ కౌశలాన్ని చూసి ఎలా చంపాలా అని ఆలోచిస్తూనే దేహాన్ని పెంచి, రాక్షస కుమారుడి కాళ్లు పట్టుకుని బలంకొద్దీ నేలమీద వేసి బాదుతాడు.
అక్షకుమారుడు, చచ్చాడని విన్న రావణుడు హతాశుడైనాడు. ఇంద్రజిత్తును (అసలు పేరు మేఘనాద) పిలిచి అతడిని యుద్ధానికి పంపాలని నిర్ణయించాడు. ఇంద్రజిత్తు, అస్త్ర విద్యలలో ప్రధముడనీ, సమస్త దేవదానవులకు శోకం కలిగించినవాడనీ, భుజబలంలో ఎల్ల లోకాలలో ప్రసిద్ధికెక్కిన వాడనీ, బ్రహ్మదేవుడి దగ్గరనుండి మహాస్త్రాలు సంపాదించి నవాడని, యుద్ధం చేయడం మాట అటుంచి, మాయలు చేయడంలో కూడా అతడికి సమానులు కారనీ అంటాడు రావణుడు. ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణ చేసి నమస్కరిస్తాడు. యుద్ధానికి పోతున్న ఇంద్రజిత్తు వేగానికి జంతువులు అరిచాయి, దిక్కులు కాంతిహనమ య్యాయి, పక్షులు ఆకాశానికెగిరి కూయ సాగాయి. ఇంద్రజిత్తు బాణవర్షాన్ని కురిపిస్తూ, హనుమంతుడి దగ్గరకు పోయే ప్రయత్నం చేయగా, ఆయన కంఠధ్వనికి, కొండలు బద్దల య్యి, భూమి కదిలి, మేఘాలు చెదిరిపోయాయి. ఇంద్రజిత్తు వేస్తున్న బాణాలు వచ్చి హనుమంతుడిని తాకాయి. ఈ వీరులిద్దరూ దేవదానవుల్లా యుద్ధం చేయసాగారు. ఇద్దరూ సమ ర్ధులే! ఇద్దరూ అతివేగంగా, భయంకర యుద్ధం చేసారు. వారిద్దరిలో తేడా కనిపించలేదు. తన బాణాలన్నీ వ్యర్ధమైపోతుంటే, ఆలోచనలో పడ్డాడు ఇంద్రజిత్తు.
ఆంజనేయుడెంతకూ తనకు చిక్కడంలేదనుకున్న ఇంద్రజిత్‌, భుజబలంతో వీడిని చంపడం వీలుకాదనీ, కట్టేయాలని భావించి బ్రహ్మాస్త్రం సంధించాడు. అది ఆంజనేయుడిని కట్టేయడంతో, కాళ్లూ, చేతులూ కదిలించలేక సోలిపోయిన ఆంజనేయుడు, బ్రహ్మ తనకిచ్చిన వరాన్ని గుర్తు చేసుకుంటాడు. భుజపరాక్రమం చాలించి, బ్రహ్మ ఆజ్ఞను దాటకూడదను కుంటాడు. రాక్షసులకు కొంచెంసేపు చిక్కినా, వరాలిచ్చిన బ్రహ్మ, ఇంద్రుడు, తండ్రి వాయు దేవుడు, తన్ను రక్షిస్తుంటే భయమెందుకు అనుకుంటాడు. బ్రహ్మ రుద్రేందాదుల వరాలను పొందిన నిరుపమ పరాక్రమశాలి హనుమంతుడు. అతడిని ఏ అస్త్రాలూ బంధించలేవు.
వీళ్లకు చిక్కినా తన్నేమీ చేయలేరనీ కదలకుండా వుండిపోయాడు. రాక్షసులు కోపంతో, బలమైన పగ్గాలను నారవస్త్రాలతో ముడేసి, కడు ప్రయత్నంతో కట్టేస్తుంటే, రావణుడిని చూడ వచ్చుకదా అన్న కోరికతో, ఆ కట్లు సహంచి వూరుకున్నాడు ఆయన. ఇంద్రజిత్తు హనుమంతుడిని, ‘బ్రహ్మాస్త్రం’తో బంధించిన తర్వాత, రాక్షసులు, తాళ్లతో, పగ్గాలతో తిరిగి కట్టేయగా నే, బ్రహ్మాస్త్ర బంధాలు తెగిపోయాయి. బ్రహ్మాస్త్ర బంధాలు మరో బంధాలతో కలిస్తే, ఆ బంధాలు విడిపోయినట్లే! దీనర్థం: ప్రపత్తి చేసినవాడు, దానిమీద విశ్వాసం లేకపోతే, ప్రపత్తికి సహాయపడుతుందని వేరే సాధనాన్ని వుపయోగిస్తే, ”ప్రపత్తి” చెడిపోతుంది. ప్రపత్తిలో వున్న అపాయం ఇదే! ఇతర ”ఉపాయాల”ను అది సహంచదు. ఉత్త ములు నీచ సహవాసాన్ని సహించరుకదా! తన దేహాన్ని కట్టేసిన అస్త్ర బంధాలు వదిలిపోయిన సంగతి ఎరుగని ఆంజనేయుడు చిక్కుబడి వున్నాడనీ, తెలిస్తే విజృంభి స్తాడనీ, అప్పుడేంగతనీ ఇంద్రజిత్తు ఆలోచనలో పడిపోయాడు.
(వాసుదాసుగారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు
    8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement