Tuesday, November 19, 2024

ధర్మం – మర్మం : కార్తీక శుద్ధ పాడ్యమి విశిష్టత మరియు అంతరార్థం (ఆడియోతో…)

కార్తీక శుద్ధ పాడ్యమి విశిష్టత మరియు అంతరార్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ..

కార్తీక శుద్ధ పాడ్యమిని ‘బలిప్రతిపత్‌’ అని అంటారు. శ్రీమన్నారాయణుడు వామనావతారంలో బలిని మూడు అడుగుల భూమిని యాచించి త్రివిక్రమావతారంతో మూడు లోకాలను స్వాధీనం చేసుకొని బలిని సుతలానికి అధిపతిని చేశాడు. లక్ష్మీపతైనా యాచనకు వస్తే వామనుడు కావాల్సిందే. వామనుడైనా లోకాధిపత్యానికి వస్తే త్రివిక్రమవుతాడు. ఇచ్చేవారి చెయ్యి క్రింద, తీసుకునే వారి చెయ్యి పైనా ఉండాలని తెలపడానికే బలి సుతలంలో నారాయణుడు వైకుంఠంలో ఉంటారు. ఇచ్చేవారి చెయ్యి కింద ఉన్నా అతని కీర్తి ఉన్నతంగా ఉంటుందనే సత్యాన్ని చెప్పేదే బలి ప్రతిపత్‌.

బలి ప్రతిపత్‌ నాడు బలిచక్రవర్తి ప్రతిమను చేసి షోడశోపచార పూజ చేసి అతని పేరు మీద ప్రతీ ఇంటిపైన ధ్వజాన్ని ప్రతిష్టించాలి. దీని నే ‘బలిధ్వజం’ అంటారు. ఉత్తరభారతదేశంలో ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. బలిప్రతిపత్‌ నాడు ఎవరి ఇంటి పై బలిధ్వజం ఎగురుతుందో వారి ఇల్లు సిరిసంపదలతో, సుఖసంతోషాలతో నిండి ఉంటుందని పురాణ వచనం. లేమి అనగా ధనము, ధాన్యము లేకపోవుట కాదు జ్ఞానము, ఔదార్యము లేకపోవడం. దానం ఇచ్చేవారు తమచెయ్యి పైన ఉంది అనుకునే అహంకారం వలన అజ్ఞానం చేరి అధోలోకం పాలవుతారని బలిచక్రవర్తి చాటాడు. అజ్ఞానం నశించి అహంకారం తొలగితే అథోలోకంలో ఉన్నవారి కీర్తి ఊర్థ్వ లోకానికి వెళుతుందని బలిధ్వజ ప్రతిష్ఠ చాటుతుంది. దాతకి ఎల్లప్పుడు సర్వోన్నత స్థితే లభిస్తుందని నారాయణుడు బలిని సుతలాధిపతిని చేయడం ద్వారా తెలుస్తుంది. దానానికి ఉన్నత స్థాన మే ఉంటుందని లోకానికి చాట డమే బలిధ్వజ ప్రతిష్ఠలోని అంతరార్థం.

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement