శ్రీరామనవరాత్రులలో చైత్రశుద్ధ తదియ యొక్క విశిష్టత గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
దౖెెవీ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణాలను అనుసరించి చెత్రశుద్ధ తదియ నాడు శివపార్వతులను, లక్ష్మీనారాయణులను, రాధాకృష్ణులను పూజించి డోలోత్సవం చేయాలి. కుంకుమ, అగరు, క ర్పూర, ధూపదీప, పుష్పమాల మణివస్త్రములతో విశేషించి దమనంతో యధావిధిగా భక్తితో కూడిన మనస్సుతో పూజించి డోలోత్సవం చేయాలి. సంతానము, ధనము కోరువారు తమ కోరికలు తీరి అన్ని వేళలా సుఖంగా ఉంటారు. అదేవిధంగా మత్స్యపురాణానుసారం సౌభాగ్యశయన వ్రతమును కూడా ఈరోజు ఆచరించాలి.
వసంత మాస మాసాధ్య తృతీయాం జనప్రియే
సౌభాగ్యాయ తధా స్త్రీభి: కార్యం పుత్ర సుఖే ప్సుభి:
అనగా చైత్రశుద్ధ తదియ నాడు సౌభాగ్యం, సత్సంతానం కోరు స్త్రీలు సౌభాగ్యవ్రతమును ఆచరించాలి. శక్తి కొలదీ ఉత్తమ శయ్యను దిండు, దుప్పటి, కంబళి మొదలైన వాటితో పాటు మంచినీళ్ల పాత్ర, మధుర పదార్థములు, పానకము, పళ్ల రసము, శక్తి కొలది ఆభరణములు, సుగంధములు అన్ని అమర్చి సిద్ధం చేయాలి. అలాగే తమ ఇష్ట దైవదంపతులను శక్తి కొలది బంగారం, వెండి, చెక్కతో తయారుచేయించి ఆ శయ్యపై ఉంచి, వైభవంగా పూజించి వేద, ఇతిహాస పురాణములు బాగా తెలిసిన పండితునకు దానం చేయాలి. ఇదేరోజున మత్స్య అవతారము ఆవిర్భవించినది కావున మత్స్యజయంతి అని కూడా అంటారు. అలాగే ఈరోజును మన్వాదిగా కూడా వ్యవహారిస్తారు.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి