Wednesday, November 20, 2024

ధర్మం – మర్మం : సుభాషిత సుధానిధి -1 (ఆడియోతో…)

సాయణామాత్యులు అందించిన సుభాషిత సుధానిధికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

భోగో యస్య సదాహేయ: ప్రియ: స్యాత్‌ నిత్య మస్తిత:
ససర్వ మంగళో పేతోపి అవశ్యం స్యాదంకిచన:

భోగము అనగా సుఖమును అనుభవించవలెను అని కోరిక. భోగము ఎంత ఇష్టమైననూ అది శాశ్వతము కాదు కావున దానిని విడువవలెను. భోగమును బాగా అనుభవించవలెనన్న కోరిక కలవారు సకల శుభములు, సంపదలు కలవారైననూ ఏమీ లేనివారే అగును. ఉన్నదంతా అనుభవించాలన్న కోరికతో అనుభవించడం మొదలుపెడితే అన్ని సంపదలు తొలగిపోతాయి. అనుభవించేది తృప్తి కొరకే కావున ఒకసారి తృప్తి పొందిన వారు మరల కావాలని అర్రులు చాస్తూ తపిస్తూ ఉంటే అన్ని ఉన్నా లేనివారే అగుదురు. భోగాని కి, సంపదకు తృప్తి పరమావధి. ఆ తృప్తి లేనివాడు సంపదలు ఉన్నా లేనివాడే.

భోగము అశాశ్వతం కావున అలాంటి భోగము నాకెందుకని విడిచిపెట్టిన వాడు అన్ని సంపదలు ఉన్నవాడగును. ”నిత్య తృప్త: నిరాశ్రయ:” అని గీతావాక్యం. అనగా ఎల్లప్పుడూ తృప్తితో ఉండువాడు ఏ ఆశ్రయము లేనివాడైనా అన్నీ ఉన్నవాడని అర్థం. భోగమును వదిలి త్యాగమును అలవర్చుకుని ఉన్నదానితో తృప్తి పొందిన వాడే అన్నీ ఉన్నవాడు.

శ్లోకంలో ఉన్న ‘సర్వ మంగళోపేత:’ అన్న పదానికి సకల శుభములు కలవాడైనా అని ఒక చమత్కారమైన అర్థము కలదు. సర్వ మంగళ అనగా పార్వతీదేవి అనగా పార్వతితో కూడిన వాడైనా అని అర్థం. పార్వతితో కూడిన శంకరుడు నిరంతరము భోగము కలవాడు. ఇచట భోగము అనగా సర్ప శరీరము అని అర్థము. పార్వతితో కూడిన శంకరుడు నిరంతరం పామును శరీరానికి చుట్టుకుని ఉండును. ఇలా భోగములు ఉన్నా సర్వ మంగళ భార్య అయినా శంకరుడు బిచ్చగాడే. సంపదలు భోగానికి కాదు త్యాగానికి ఉపయోగించాలని శ్లోకార్థం.

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement