Monday, November 25, 2024

ధర్మం – మర్మం : సుభాషిత సుధానిధి -2(బి) (ఆడియోతో…)


సాయణామాత్యులు అందించిన సుభాషిత సుధానిధికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

విప్ర సుమనసోహిత్వా బృంగవత్‌ దాన లిప్సయా
ఆశ్రయన్‌ నృప మాతంగ శీదేత్‌ శ్రుతి నిషేధత:

బ్రాహ్మణుడు పండితులను విడిచిపెట్టి దానము మీద ఆశతో రాజులను ఆశ్రయించరాదు. రాజులను ఆశ్రయించి వారి నుండి దానము తీసుకోరాదని వేదము నిషేధించినది కావున ఆ విధంగా చేసిన వారు కష్టాల పాలగుదురు. బ్రాహ్మణుడు తన జ్ఞానమును పెంచుకోవడానికి మరియు పంచుకోవడానికి తన తోటి పండితులను ఆశ్రయించాలి కానీ రాజులను కాదన్నది ఇందులోని నీతి.

‘కవితార్కిక కేసరి’ అన్న బిరుదు పొందిన మహానుభావుడైన వేదాంత దేశికులు పరమ దరిద్రంతో బాధపడుతున్నా, తన సహాధ్యాయి అయిన విద్యారణ్యుడు రాజులను ఆశ్రయించమని ఎంత బోధించినా ఆయన వినలేదు.

శిలంకి మనలం భవేత్‌ అనల మౌదరం బాధితుమ్‌
భజంతి విభుదాముదా అహహ కుక్షిత: కుక్షిత:

- Advertisement -

ఆకలితో కడుపులోని మంటను చల్లార్చుకొనుటకు భిక్షాటన సరిపోదా.. పండితులు ఈ పొట్ట కోసం ఎందుకు చెడు రాజులను ఆశ్రయిస్తారోనని వేదాంత దేశికులు సమాధానమిచ్చెను. ఈ విధంగా దుష్టరాజులను పండితులు ఆశ్రయించరాదని అలా ఆశ్రయించిన శ్రీనాథుడు చివరికి రాజు చేత శిక్షించబడ్డాడు కావున చెడు రాజులను ఆశ్రయిస్తే సంపద కంటే బాధలు ఎక్కువ అని భావ ం.

పై శ్లోకంలో ‘సుమనస’ అన్న పదమునకు పండితులు పువ్వులు అని అర్థం. తుమ్మెద సుగంధము గల మకరందాన్ని అందించు పూలను వదిలి మద జలం స్రవించు ఏనుగుల కుంభస్థలాన్ని ఆశ్రయిస్తే తుమ్మెదల రొదకు ఏనుగులు తమ విశాలమైన చెవులతో తుమ్మెదలను కొట్టును. పుష్పాలను వదిలి తుమ్మెదులు ఏనుగులను ఆశ్రయిస్తే వాటి చెవుల దెబ్బలతో బాధపడాలి. అలాగే పండితులు తోటి పండితులను వదిలి రాజులను ఆశ్రయిస్తే వేద నిషేధంతో పాపము, రాజుల శిక్షతో తాపము తప్పదని భావము.

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement