Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు (ఆడియోతో…)


మహాభారతం శాంతిపర్వంలోని సుభాషితంపై శ్రీమాన్‌ శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వివరణ..

సర్వవేదాది గమనం సర్వ తీర్థావగాహనం
సర్వ యజ్ఞ ఫలం చైవ నైవ తుల్యం అహింసయా

సకల వేదములను అధ్యయనం చేయుట ప్రపంచంలోని అన్ని తీర్థములలో స్నానమాచరించుట శాస్త్రం విధించిన సకల యజ్ఞములను ఆచరించుట వలన కలిగిన ఫలము అహింసతో సమానము కాదు.

శరీరం, మనసు పవిత్రమగుటకు తీర్థములలో స్నానమాచరించుట, బుద్ధి పరిశుద్ధమగుటకు వేదములను అధ్యయనం చేయుట త్యాగం అలవడుటకు సకల యజ్ఞములను ఆచరించాలి ఈ విధంగా పవిత్రమైన మనసు, పరిశుద్ధమైన బుద్ధి, త్యాగబుద్ధి ఉన్ననూ మరొక ప్రాణిని హింసించుట మానకపోతే అవన్నీ నిష్ఫలాలు. తాము కోరినది ఇంకొకరి చేతిలో ఉన్నప్పుడు ఇంకొకరు తమ కోరికకు అడ్డు వస్తున్నారన్నప్పుడు ఇతర ప్రాణులను హింసిస్తాము. ఆ హింస అహింసగా మారిన నాడు అనగా స్వార్థము, ఆశ, కోరిక లేకుండా నాకు భగవంతుడు ఇచ్చినది చాలన్న భావంతో ఉన్న దానిలో నలుగురికి అందిస్తామనుకున్నవారు హింస తలపెట్టరు.

వేదాధ్యయనం చేయుట వలన భగవంతుడు ఇచ్చినది చాలన్న భావం కలుగుతుంది ఎదుటి వారు నాలాంటి ప్రాణి అని వారికి మన వలే ఆశలు, ఆశయాలు ఉంటాయని అలాగే నాది అన్నది ఇంకొకరికి చేరదు, ఇంకొకరిది నాకు రాదు అన్న పరిశుద్ధమైన సంకల్పం సకల తీర్థములలో స్నానమాచరిస్తే కలుగును. యజ్ఞమాచరిస్తే ఉన్నదానిలో నలుగురికి పంచాలన్న త్యాగ బుద్ధి కలుగుతుంది. మన కోసం మన స్వార్థం కోసం మరో ప్రాణిని హింసించడం మహాపాపం. జాలి, దయ కలవారు వేదాధ్యయనం, తీర్థస్నాన, యజ్ఞాచరణము చేయకున్న నష్టం లేదు. కావున అధ్యయన, స్నాన, యజ్ఞములు అహింసకు సాటిరావు.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement