Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 27 (ఆడియోతో…)

ఇతిహాస సముచ్ఛయంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

కామినో వర్ధయన్‌ లోభమ్‌ లుబ్ధస్యచ వర్ధయన్‌ ధనమ్‌
నర: కిం ఫలమాప్నోతి కూపేంధనివ పాతయన్‌

కోరికలు కలవారికి లోభాన్ని పెంచుతూ, లోభం కలవాడు ధనాన్ని పెంచుకుంటూ పోతాడు. ఇలా లోభము, ధనము పెరిగిన నాడు నరుడు పొందే ఫలమేముంది. గుడ్డివాడిని బావిలో పడివేయడం లాంటిదే.

కోరికలు లోభాన్ని అనగా పిసినారితనాన్ని కలుగజేస్తాయి. దీన్నే ‘కృపణత్వం’ అని అంటారు. కోరికలు పెరుగుతుంటే పిసినారితనం పెరుగుతుంది. అలా కలిగిన పిసినారితనం ధనమును, ఆస్తిని బాగా పెంచుతుంది. లోభి ఆ ధనమును తాను అనుభవించడు, ఇతరులకు దానం చేయడు. ఎవరికీ ఉపయోగబడని ధనం ఆ లోభికి కూడా ఫలమివ్వదు. అంధుడు బావిలో ఉన్నా, నేలపై ఉన్నా పెద్దగా తేడా అతనికి ఉండదు, అలాగే ఇతరులకు పనికిరాని ధనం వలన ఏమి ఫలం కలుగుతుందని భావం. కావున తన కోసమే అని కాకుండా నలుగురి కోసం కోరికలు కోరితే అది త్యాగమవుతుంది లేదా శ్రద్ధగా చేస్తే యాగం అవుతుంది. నాతో పాటు నలుగురూ బాగుండాలనేది సామాన్యుని లక్షణం, నలుగురితో పాటు నేను కూడా బాగుండాలి అనేది సజ్జనుని లక్షణం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement