శ్రీమన్నారాయణుని అవతారాలలోని ఆంతర్యం
శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలి అనుకున్నప్పుడు రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న నామంతో సృష్టి చేస్తాడు. రక్షించాలి అనుకున్నప్పుడు సత్వగుణాన్ని తీసుకొని విష్ణువు అన్న నామంతో రక్షిస్తాడు. సంహరించాలి అనుకున్నప్పుడు తమోగుణాన్ని తీసుకొని రుద్ర నామం తో సంహరిస్తాడు. సూక్ష్మ దృష్టితో చూస్తే ఈ మూడు రక్షణకే. అవసరమైనపుడు సృష్టించడం, అవసరం లేని దాన్ని తప్పించడం, ఈ రెండూ రక్షణలో భాగమే. క్షీరసాగరమున ఆదిశేషునిపై పడుకుని ఉన్న స్వామి ” సహస్ర శీర్ష పురుష: సహస్రాక్ష: సహస్రపాత్” అని చెప్పినట్టుగా పరమాత్మ విశ్వరూపమే అన్ని అవతారాలకు ఆధారం. స్వామి అవతారాలు అనంతాలైనా దశావతారులు ప్రసిద్ధం కాగా ప్రధానంగా పురాణాల్లో పేర్కొనబడినవి 24 అవతారాలు. ఈ అవతారాల వైశిష్ట్యం, వైభవం, విశేషాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోదగినవి.
ఈరోజు కపిల మహర్షి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
కర్దమ ప్రజాపతి తండ్రి ఆజ్ఞ మేరకు గృహస్తాశ్రమం స్వీకరించి ఉత్తమ సంతానాన్ని పొందాలని శ్రీమన్నారాయణుని గూర్చి కఠినమైన తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమై త్వరలో స్వాయంభువ మనువు తన కుమార్తె దేవహూతితో నీకు వివాహం జరిపిస్తే తాను కుమారునిగా పుడతానని అనుగ్రహించెను. స్వామి ఆజ్ఞ మేరకు దేవహుతిని వివాహం చేసుకున్న కర్దమ ప్రజాపతి 9 మంది అమ్మాయిలను తదుపరి కపిల మహర్షిని కుమారుడిగా పొందారు. 9 మంది అమ్మాయిలను నవ ప్రజాపతులకు ఇచ్చి వివాహం చేయగా కపిల మహర్షి ఆజ్ఞతో కర్దమ ప్రజాపతి వానప్రస్తములో పరమాత్మను ధ్యానిస్తూ ఉండిపోయెను. కపిల మహర్షి తల్లియైన దేవహుతికి సాంఖ్యాశాస్త్రమును, తత్వములను భోదిస్తూ లోకానికి జ్ఞానాన్ని అందించెను. అందులో భాగంగా సాంఖ్య యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, భక్తియోగం మొదలయిన యోగాల గూర్చేగాక గర్భంలో శిశువికాసం, అలాగే జీవనంలో క్రమవికాసం జీవనంలోని కష్టనష్టాలు బరువు బాధ్యత లు, ఆశలు, పాశాలు, మోసాలు, మోహాలు ఈ విధంగా అనంతమైన జీవనవేదాన్ని తల్లికి అందించారు. దు:ఖనివారణ సుఖమనేది అజ్ఞానం అని భోదించెను. సంసారం తనపై ఉంచి తనయందు మనసు నిలిపితే మోక్షమని భోదించి అంతర్థానం చెందెను. నేటికీ హిమాలయాలలో మేరుపర్వతంపై పాతాళంలో ఉన్న కపిలాశ్రమాలు యోగులకు దర్శనమిస్తాయి. కపిల మహర్షిని స్మరిస్తూ ఆయన ఉపదేశాలలోని వేదాంతాన్ని గ్రహించి జీవనాన్ని మోక్షమార్గం వైపు పయనింపచేయాలి.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి