Friday, November 22, 2024

ధర్మం – మర్మం : మకర సంక్రాంతి, తిలాదానం ప్రత్యేకత (ఆడియోతో…)

మకర సంక్రాంతి విశిష్టత మరియు పాటించాల్సిన విధులు గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
సౌరమానం ప్రకారం 12 రాశులు కనుక ప్రతీ నెలా సూర్యుడు ఒక రాశి నుం డి మరొక రాశిలోకి చేరుట సంక్రాంతి. సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు కర్మ సాక్షి, జగచ్చక్షువు అంటే మనం చేసే ప్రతి పనికి సూర్యుడే సాక్షి. భూభ్రమణంలో కూడా మాంద్యం శీఘ్రములను కూడా కలిగించేవాడు సూర్యుడే. అందువలన కొంత కాలం పగలు ఎక్కువ, మరికొంత కాలం రాత్రి ఎక్కువ. సూర్యుడు కర్కాటక రాశిలో చేరినపుడు దక్షిణాయన పుణ్యకాలం అని మకర రాశిలోకి ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం అని మేష, తుల రాశులలో చేరినపుడు వి షువ పుణ్యకాలం అనీ, ధనుర్‌, మీన రాశులలో చేరినపుడు విష్ణుపద పుణ్యకాలం అని, సింహ, కుంభ రాశులలో చేరినపుడు ప్రహర పుణ్యకాలం అని శాస్త్రం చెబుతోంది. మన బుద్ధిని ప్రేరేపించేవాడు, స్థంభింపచేసేవాడు సూర్యభగవానుడే. కనుక ప్రతీ సంక్రాంతికి కాకపోయినా దక్షిణాయణ, ఉత్తరాయణ పుణ్యకాలమును సూచించే కర్కాటక, మకర సంక్రాంతులలో త్రికరణ శుద్ధిగా స్నానం, స్వార్థం తొలగడానికి దానం, మానసిక ఏకాగ్రతకు జపం చేయాలి. మకర సంక్రమణ స మయంలో పుణ్య నదీ స్నానం, దానం, జపం తప్పక ఆచరించాలి.

స్నానం వలన శరీర శుద్ధి, దానం వలన ద్రవ్య శుద్ధి, పదిమందికి భోజనం పెట్టడం వలన స్వార్థ నిర్మూలన జరుగుతాయి. స్నానం, దానం కేవలం మనకోసం కాదు, మనం చేసే ప్రతి పని మనలో వివేకాన్ని, నిస్వార్థాన్ని మేలుకొలపడంతోపాటు పది మందికి పంచడం కూడా పరమోద్దేశ్యం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో పుణ్యనదులలో స్నానం చేయడం, అక్కడే దానం చేయడం, భక్తి, యోగ్యత ఉన్నవారు జపం, హోమం చేయడం ఆచారం. ఈ సమయంలో చేసిన ప్రతి పని లక్ష రెట్ల అధిక ఫలితాన్ని కలిగిస్తుందని శాస్త్ర వచనం. మకర సంక్రాంతి నాడు చేసే అన్ని దానాలలో వస్త్ర దానం చాలా విశేషమైనది. మనం ఇచ్చే వస్త్రంలో ఎన్ని దారాలు ఉంటయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గవాసం కలుగుతుందని పురాణవచనం. కావున దానం ఇచ్చేవారికి లాభాన్ని చేకూరుస్తుంది, పాపాలను పోగొట్టి స్వర్గాన్ని పొందిస్తుంది. ఇచ్చిన దానికి వంద రెట్లు తిరిగి వస్తుంది. ఇది పర్వకాలంలో చేస్తే అధిక ఫలితాన్ని ఇస్తుంది. మకర సంక్రాంతి ప్రతి
పౌర్ణమి, అమావాస్య, దసరా, దీపావళి, సంవత్సరాది, గ్రహణములు ఇతర సంక్రమణములు వీటిని పుణ్యకాలములు అంటారు. పుణ్య కాలములో పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించి, పుణ్యాత్ములకు పుణ్యంతో సంపాదించిన వాటిని దానం చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.

మకర సంక్రాంతి నాడు తిల దానం కూడా అత్యంత ప్రశస్తం. సాధారణంగా తిలలు(నువ్వులు) అంటే చిన్న చూపు. ‘తిలా: శ్వేతా: తిలాపీతా: తిలా కృష్ణా: శుభావహా: ‘ ‘ జగత్‌ తిష్టతి దేవేస్మి యథా తై లం తిలే స్థితం’ అనునది వేదవాక్యం అనగా నువ్వు గింజలో నూనె ఉన్నట్లు పరమాత్మలో జగత్‌ ఉన్నదని గొప్ప సత్యాన్ని తిలలు తెలియజేస్తాయి. గానుగతో నూనె మరియు ధ్యానంతో పరమాత్మను చూడవచ్చు. తిల దానం చేసినచో ఇవ్వబడే నువ్వులలో, ఇచ్చే నాలో ఆ పరమాత్మే ఉన్నాడు అని మధుర భావన. కావున తిలదానం చాలా ప్రశస్తం. అందుకే దీన్ని తిల సంక్రాంతి అంటారు.

శ్రీమాన్‌ డాక్ట ర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement