Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : కార్తిక శుద్ధ ఏకాదశి విశిష్టత (ఆడియోతో…)

కార్తిక శుద్ధ ఏకాదశి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

కార్తిక శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా వ్యవహరిస్తారు. దామోదర ఏకాదశి, మోక్షప్రద ఏకాదశి అని కూడా పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైతే కార్తిక శుద్ధ ఏకాదశికి ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో శయనించును. కార్తిక శుద్ధ ఏకాదశినాడు మరోపక్కకు తిరుగును కావున దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు. శ్రీరంగాది క్షేత్రములు, కావేర్యాది నదులు స్వామికి అభిముఖంగా ఉంటాయి. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కృతమూల, పయోద అనే నదులు స్వామికి పుష్టభాగంలో ఉంటాయి. అధర్మం నశించాలనుకునేవారు కార్తిక శుద్ధ ఏకాదశి అనంతరం కృష్ణ, గోదావరి నదులలో స్నానం ఆచరించాలి స్వామి కటాక్షం, మోక్షం కావాలనుకునే వారు గంగా, కావేర్యాది నదులలో స్నానమాచరించాలని విష్ణుధర్మం ద్వారా తెలుస్తోంది. కార్తిక శుద్ధ ఏకాదశినాడు నదీ స్నానం చేసి ఉపవసించి తులసీ, ధాత్రీలను యధాశక్తి ఆరాధించి అభీష్టమును పొందవచ్చును.

తులసీదళ లక్షేణ కార్తికే యో అర్చయేత్‌ హరిం |
పత్రే పత్రే మునిశ్రేష్ఠా మౌక్తికం లభతే ఫలం ||

కార్తిక శుద్ధ ఏకాదశినాడు కేశవునికి లక్షతులసీ పూజార్చన చేసినచో ప్రతీ తులసీదళంలో ముక్తి లభిస్తుంది. ఎన్ని తులసీదళాలతో అర్చన చేస్తే అన్ని కోట్ల ముత్యాలు లభిస్తాయి. ముత్యాలు అనగా మోక్షలక్షణాలు అని అర్థం.

- Advertisement -

కార్తికమాసంలో ప్రత్యేకించి ఈ ఏకాదశి నాడు ధాత్రీ(ఉసిరి) వృక్షాన్ని పూజించాలి. ఈనాడు ఉసిరి చెట్టు కింద కూర్చుని నారాయణ నామాన్ని జపించిన ఒక నామం కోటి నామాలతో సమానం.

కార్తికే శిత ఏకాదస్యాం నరో నియత మానస:
ధాత్రీ మూలే హరేర్నామ జపేం ముక్తి మవాప్నుయాత్‌
ఏకైకస్మిన్‌ తధా నామ్ని కోటి నామ ఫలం లభేత్‌

ఈ ఏకాదశినాడు సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించి అర్ఘ్యప్రదానం చేసి శ్రీహరి నామం జపించి భక్త జనులతో కలసి ధాత్రీ, తులసీ వృక్షములను పూజించి వాటి సమీపాన పగలు,రాత్రి హరి నామ సంకీర్తన చేసినవారికి పునర్జన్మ ఉండదు. కార్తికమాసంలో ప్రత్యేకించి శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ నాడు ఉసరి రసాన్ని ఒంటికి రాసుకుని స్నానమాచరించేవారికి వారి పితృదేవతలందరికీ శ్రీమన్నారాయణుడు వెంటనే మోక్షము ప్రసాదించును. ”ధాత్రి ఫల కృతాహార: నరోనారయణో భవేత్‌||” అనగా కార్తిక మాసమంతా కేవలము ఉసిరిఫలమును ఆహారముగా తీసుకొను వారు సాక్షాత్తు నారాయణులే అయ్యెదరని శ్లోకార్థం.

—శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి


Advertisement

తాజా వార్తలు

Advertisement