Saturday, November 23, 2024

ధర్మం -మర్మం : కార్తికమాసమున శ్రీహరిని పూజించు విధానము (ఆడియోతో…)

కార్తికమాసమున శ్రీహరిని పూజించు విధానము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

ఈ మాసమున తీర్థయాత్రలు చేసి ఆయా పుణ్యతీర్థములలో స్నానమాచరించిననూ విశేషించి బిందు తీర్థము, కావేరీ పంచనదము, నర్మదా, గంగా, యమునా, సరస్వతీ, గోదావరీ, కృష్ణా, సింధూ నదులలో స్నానమాచరించిన ముక్తి లభించును. ఈ మాసమున అగస్తి(అవిశ పూలు) మరియు ముని(మందారం) పుష్పములతో కేశవుని పూజించవలెను. విశేషించి మాలతి(సన్నజాజి), మొగలిపూలతో శ్రీహరిని సేవిం చిన ముక్తి లభించును. కమలములతో శ్రీహరిని పూజించినచో కమల(లక్ష్మీ దేవి) వారి ఇంట స్థిర నివాసము ఏర్పరుచుకొనును. నారాయణుని నామములతో, పుష్పములతో కేశవుని అర్చించిన యమ భయం తొలగి స్వర్గప్రాప్తి కలుగును.

కార్తికమాసమున శ్రీమహావిష్ణువు వద్ద దీపదానము చేసిన వారికి పునర్జన్మ ఉండదు. శక్తికొలదీ ప్రతీ రోజూ మాసమంతా ఉపవాసం లేదా ఒక పూట ఉపవాసం చేసి ఆకలిగొన్నవారికి భిక్ష పెట్టినచో వైకుంఠప్రాప్తి కలుగును. కార్తికమాసమున వ్రీహులు, యవలు, గోధుమలు, కొర్రలు వరి, సజ్జలు వంటి సాత్విక ధాన్యములను భుజించాలి.

దామోదరాయ నభసి తులాయాం లోలయా స:
ప్రదీపం తే ప్రయచ్ఛామి నమోనంతాయ వేధసే

అను మంత్రముతో ఈ మాసమున నువ్వులనూనెతో ఆకాశదీపాన్ని వెలిగించాలి. తులామాసంలో ప్రతీరోజు సాయంకాలం నువ్వుల నూనెతో ఆకాశదీపాన్ని నెలరోజుల పాటు వెలిగించి, శ్రీమహావిష్ణువును ఆరాధించువారు గొప్ప సౌభాగ్యాన్ని, సంపదను పొందుతారు.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement