Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : త్రివిధ తపములు (ఆడియోతో…)

శివపురాణం ఉమాసంహిత 20వ అధ్యాయంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

జపోధ్యానంతు దేవానాం అర్చనం భక్తి తశ్శుభమ్‌
సాత్త్వికం తద్వినిర్ధిష్టం అశేష ఫల సాధనమ్‌

ఇహలోకే పరేచైవ మనోభి ప్రేత సాధనమ్‌
కామనాఫల ముద్దిశ్య రాజసం తప ఉఛ్యతే

నిజదేహం సుసంపీడ్య దేహ శోషక దుస్సహై:
తపస్తామస ముద్దిష్టం మనోభి ప్రేత సాధనమ్‌

దేవతలు భక్తితో ఆచరించే జపము, ధ్యానము, అర్చన ఇవి సాత్త్విక తపము అనబడతాయి. ఈ సాత్త్విక తపస్సు ధర్మ, అర్ధ, కామ, మోక్ష రూపములైన సకల ఫలములను ప్రసాదించును. ఈ సాత్త్విక తపస్సు ఇహలోకమున పరలోకమున తన మనస్సు కోరిన దానిని సాధించి పెట్టును.
ఇక ఏదైనా కామనను మనసులో పెట్టుకొని తన దేహమును శుష్కింప చేయగల ఉపవాస వ్రతాదులతో సహింప శక్యం కాని కఠిన నియమములతో తన దేహాన్ని బాగా పీడింప చేసి చేసే తపస్సును రాజసమైన తపస్సు అందురు. ఇది కూడ మనస్సు కోరిన దానిని సాధించును.
ఇక శరీరమును పీడించుచూ బాధింపచేయుచూ ఎన్నో యాతనలకు గురి చేయుచూ తమ దేహాన్ని, ఇతరుల దేహాన్ని, మనస్సును పీడించుచూ చేసే తపస్సు తామస తపస్సు. ఇది కూడ మనస్సు కోరిన దానిని ప్రసాదించును. అసురులు, రాక్షసులు ఈ తపమును చేతురు. హిరణ్యకశ్యప, రావణ, తారకాసుర, అంధకాసుర, గజాసురాదులు ఇందుకు ఉదాహరణ.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement