ఇతిహాస సముచ్ఛయంలోని సుభాషితం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
కామిన: వర్ణయన్ కామాన్ లోభం లుబ్ధస్య వర్ధయన్
నర: కిం ఫలమాప్నోతి కూపేంధ మివపాతయన్
లోకచిత్తావతారార్ధం వర్ణయిత్వాతు తేన తా
ఇతిహాసై: పవిత్రార్ధై: పునరత్రైవ నిందితౌ
అన్యధా ఘోర సంసార పతితస్య జనస్య తౌ
వర్ణయేత్ స కధం విద్వాన్ మహా కారుణికో ముని:
ఇతిహాస పురాణములలో వ్యాస భగవానుడు కాముకుల కామ చేష్టలను విపులంగా వర్ణించి ఉన్నాడు. దుర్యోధనాధుల లోభాన్ని, వారి చేష్టలను అతి విస్తారంగా వర్ణించినారు. ఇవి చదివితే కాముకులలో కామం, లుబ్ధులకు మరింత లోభం పెరుగుతుంది. గుడ్డి వాడిని బావిలో వేసినా ఒడ్డున నిలిపినా తేడా ఏముంది? అలాగే వీటిని వర్ణించడం వలన చదివిన వాడు చెడిపోవడం తప్ప బాగవుతాడా అనేది వ్యాస హృదయం తెలియని వారి శంక. కానీ వ్యాస భగవానుడు లోకంలోని చిత్తము ఎలా భావిస్తుంది ఎలా ఆచరిస్తుంది అలా ఆచరించినందు వలన వారు ఎలాంటి ఫలితాన్ని పొందుతున్నారన్నారో వివరంగా తెలియజేశారు.
సీతను కోరిన రావణుడు, రాజ్యాన్ని కోరిన దుర్యోధనుడు, కపటోపాయంతో ఎదుటి వారిని నశింపచేయాలనుకున్న శకుని, రాజ్యం అంతా నాదే అనుకున్న హిరణ్యకశిపుడు ఎలాంటి పరిణామాలను పొందారో తెలలియడానికే కామలోభాలను మహా కరుణ గల వ్యాసముని అంతగా వర్ణించాడు. స్త్రీ సౌందర్యాన్ని అంతగా వర్ణించిన వ్యాసుడు వయస్సు మళ్లి తే సౌందర్య విహీనమవుతారని కూడా తెలిపి అలాంటి వాటిని అనుభవించాలని కోరుకున్న కాముకులు ఎలా పతనమవుతున్నారో, పతనమయ్యారో తెలుపడానికే కామలోభాలను అంతగా వర్ణించారు. వాటిని చదివి కామలోభాలను పెంచుకోవడానికి కాదు తెంచుకోవడానికేనని దయ గలవ్యాసుడు అలా వర్ణించారు.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి