Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : అహితము (ఆడియోతో…)


పద్మపురాణంలోని ఉత్తరాఖండంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

వ్యాఘ్రీవ తిష్ఠతి జరా పరితర్జయన్తీ
రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరన్తి దేహమ్‌
ఆయు: పరిస్రవతి భిన్న ఘటా దివాంభ:
లోకస్త దాప్యహిత మా చరతీతి చిత్రమ్‌

ముసలితనము తాను వస్తున్నాను అని పెద్ద పులి వలే బెదిరిస్తూ ముందు నిలుచున్నది. ఇక రోగములు భయంకరమైన శత్రువులు వలే ఈ
దేహాన్ని గాయపరుస్తున్నాయి. చిల్లి పడిన కుండ నుండి నీరు వలే ఆయుష్యము రోజు రోజుకు కారిపోతూ ఉన్నది. అయినా ఈ లోకమున ఎదుటివాడు చెడిపోవాలి, తానే బాగుండాలి అని భావిస్తూ ఇతరులకు అహితమును ఆచరించడం ఎంత విచిత్రమని అంబరీష మహారాజుతో నారద భగవానులు అంటున్న ఈ శ్లోకం పద్మపురాణం, ఉత్తర ఖండంలోనిది.

యవ్వనంలో ఉన్నవారు తామెప్పటికీ దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామని తమకేమి కాదని తలుస్తూ తమ శక్తి సామర్థ్యాలతో ఎదుటి వారికి హాని కలిగిస్తూ ఉంటారు. ముసలితనం పెద్దపులిలా ముందే నిలుచున్నా దానిని చూడరు. తన చుట్టూ రోగాలు శత్రువుల వలే చుట్టుముట్టి దేహాన్ని గాయపరచడానికి సిద్ధంగా ఉన్నాయి. అయినా తాము కూడా ఒక రోగంలా ఎదుటి వారిని గాయ పర్చాలని చూస్తారు. ఇక ఆయుష్యము రోజురోజుకు తరిగిపోతున్నా అది తెలియక తామెప్పటికీ బ్రతికే ఉంటామన్న భ్రమతో ఎదుటి వారి కి హాని కలిగించాలని ఆలోచిస్తారు. తామెప్పుడు తనువు చాలిస్తారో తమకే తెలియదు. పది నిమిషాలలో ప్రాణం పోతున్నవారు కూడా పక్కవారి మీద కోపాన్ని, అపకార భావనతో వింత ప్రవర్తన కలిగి ఉంటారు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement