మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
శేవం సుఖముశంతీహ కేచిత్ జ్ఞానం ప్రచక్షతే
తౌ ధారతయతి వై యస్మాత్ శేవధి: తేన సోచ్ఛతే
శేవ అనగా సుఖము, జ్ఞానము. సుఖమును జ్ఞానమును ధరించిన వానిని శేవధి అంటారు. ఇచ్చట సుఖము అనగా నూటికి తొంభై మంది శరీరము కోరే సౌకర్యము అనుకుంటారు. వాస్తవంగా తాను కోరిన సౌకర్యమును పొందిన ప్రతీ సారి దు:ఖమే కలుగును అనగా రుచిగా ఉందని కాస్త ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చినట్టు. అందుకే సుఖం అంటే దు:ఖము, బాధ, ఆవేదన లేని ప్రవృత్తి. వాస్తవంగా ‘ఖం’ అంటే ఇంద్రియం. సుఖం అంటే మం చి ఇంద్రియం. పరమాత్మను, భగవంతుని భక్తులను సేవిస్తుంది. అంతే కాని క్షణ కాలంలో నశించే శబ్ధాది విషయములను కాదు. అందుకే సుఖమంటే భగవంతుని యందు, భగవంతుని భక్తుల యందు ప్రీతి కలిగి ఉం డుట. ‘ మోక్షేతిధి: జ్ఞానమ్ ‘ అనగా మోక్షము గురించి తెలియుటను జ్ఞానమని అమరకోశం చెబుతోంది. లోకంలో ఎలా బ్రతకాలో తెలిపేది విజ్ఞానము. అంటే కష్టాలను, నష్టాలను, బాధలను, ప్రమాదాలను, బంధాలను, వేదనలను ఎలా తెంచుకోవాలో చెప్పేది విజ్ఞానము. సంసారం వలన కలిగే అన్ని బాధలను తొలగించి పరమాత్మ సన్నిధిని చేరే విధానం తెలియుట జ్ఞానము. ఇలా భగవంతుని యందు, భగవంతుని భక్తుల యందు ప్రీతి కలిగి ఆ భగవంతుని చేరే మార్గమును తెలియడాన్ని శేవధి అంటారు.