Friday, October 18, 2024

ధర్మం – మర్మం : సజ్జనుల చరితము (ఆడియోతో..)

శ్రీమద్భాగవతం ఏకాదశవ స్కందంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కం దాడై రామానుజాచార్యుల వారి వివరణ…

3.
శ్రుత్యోనుపఠితో ధ్యాత ఆదృతోవానుమోదిత:
సద్య:పునాతి సద్ధర్మో దేవ విశ్వద్రుహోపి హి

సజ్జనుల ధర్మమును (భాగవత ధర్మమును) వినిననూ, చదివిననూ, ధ్యానించిననూ, ఆదరించిననూ, ఆమోదించిననూ దేవద్రోహి విశ్వద్రోహి కూడా వెంటనే పవిత్రుడగునని భావము.

భగవంతునియందు మాత్రమే మనసు నిలిపిన వారిని భాగవతులందురు. వారినే సత్‌ జనులు అందురు. సత్‌ అనగా పరమాత్మ ‘ సదేవ సోమ్య ఇద మగ్ర ఆసీత్‌ ‘అనునది ఉపనిషద్వాక్యము. కావున ఇచట సద్ధర్మము అనగా భగవద్ధర్మము, భాగవత ధర్మము, సజ్జనుల ధర్మము అని అర్థము. సజ్జనులు దీనవత్సలులు అని, వారి వాత్సల్యమే దీనులకు సుఖసంతోషములను కలిగించునని ముందు శ్లోకం ద్వారా తెలుస్తోంది. ఈ శ్లోకమున అటువంటి మహానుభావులను దర్శించలేని వారు, సజ్జనుల దృష్టి ప్రసరించుటకు అవకాశము లేని వారు తరించు మార్గము లేదా అన్న వసుదేవుని ప్రశ్నకు నారద మహర్షి ‘సుఖాయైవ హి సాధూనాం చరితం’ అని యున్నారు. సాధువులను దర్శించుట కుదురకున్ననూ వారి చరితమును వినినా సుఖసంతోషములు కలుగునని వి వరించారు. మరి వినినంత మాత్రాన సుఖము ఏవిధంగా కలుగునో వివరిస్తూ ఒక వినుట వలనే కాక చదివిననూ, ధ్యానించిననూ, ఆదరించిననూ, ఆమోదించిననూ పతిత్రులగుదురు అని అన్నారు కావున ఒక్కొక్కటి పావనము చేయునని అర్థము. అనగా ఏదైనా చరితమును వినిన తరువాత చదవాలనిపించును అటు తరువాత నెమరు వేసుకోవాలనిపించును దీనినే ధ్యానమందురు. ఈ విధంగా ధ్యానము చేసిన వారు ఆ చరితమును ఆదరించి ఆమోదింపచేయును. కాన ఇది క్రమ వికాస పద్ధతి ఈ విధంగా జరిగిన తరువాత ఇన్ని జరిగిన తరువాత ఎంతటివాడైననూ అనగా దేవ ద్రోహి, విశ్వ ద్రోహి కూడా పవిత్రుడైతీరును అని అభిప్రాయము.

దేవద్రోహి, విశ్వద్రోహికి మనసు – బుద్ధి కాలుష్యమై, అసూయ ద్వేషములతో నిండియుండును. ఒక్క చక్కని గానము శిశువులను, పశువులను, పాములను కూడా పరవశింప చేయుటను చూస్తున్నాము. అనగా ఒక క్రమ పద్ధతితో స్వర బద్ధముగా పఠించినది విషము నిండియున్న పాములను కూడా పరవశింప చేసినపుడు విష స్వభావము కల ద్రోహుల మనసున భగవంతుని నామ పారాయణ శ్రవణము, క ధా గానము చేయువారి చరితము ఎందుకు పరవశింప చేయదు. మనము వినునది సజ్జన చరితమే, సజ్జన ధర్మమే కాని భగవంతుని నామ సంకీర్తన కాద ని తలవరాదు. సజ్జనుల చరితములో నిలువెల్లా భగవత్‌ భాగవతా దాస్యం, కధా శ్రవణం, నామసంకీర్తనమే అయినపుడూ ఆ నామము అక్షర స్రవంతి వారి మనసులో పదిమార్లు, వంద మార్లు పడినపుడూ, వారి భజన వి నినపుడూ వారు పరవశించకున్ననూ వారికి తెలియకుం డగానే ఆ నామమును పలుమార్లు పలవరించకమానరు. ఇది విన్న తరువాత పఠనము, చదివిన తరువాత ధ్యానాదరామోదములు తమంత తాముగా జరుగుతాయ. గర్భములో ఉన్నపుడు ప్రహ్లాదుడు వినుట వలనే అంతటి భగవతోత్తముడైనాడు. చెవిలో పడి చవులూరించక మానునా అన్న విధంగా ఒక్కొక్క నామము ఒక్కొక్కరి చరితము ద్రోహుల మన సులో ఒక్కొక్క కాలుష్యమును తొలగిం చును, దానితో వారు పవిత్రులగుదురు. కావున సత్కధా కాలక్షేపము, సద్ధర్మ ప్రబోధములు బహిరంగ స్థలములలోనే ఎక్కువ జరిగితే ఇష్టమున్నవారు, ఇష్టము లేని వారు కూడా తప్పక వింటారు. కొన్ని మంచి విషయాలు అపుడప్పుడు చెవులలో పడిననూ ద్రోహ చింతన తొలగి మార్పు చెందుతారు. గాన సద్ధర్మము పది మందికి తప్పక కనిపించవలయునని ఋషి హృదయము.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement