పద్మపురాణములోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విరవణ..
క్వసుధా క్వ కధా లోకే క్వకాచ: క్వమణి: మహాన్
బ్రహ్మరాత: విచార్యైవం తధా దేవాన్ జహాస హా
పరీక్షిత్తు మహారాజు శృంగి శాపంతో ఏడు రోజుల్లో తక్షక సర్పం వల్ల మరణించే తనకు రాజభోగాలెందుకని పుత్రులకు రాజ్యాన్ని అప్పగించి గంగా తీరములో ప్రాయోపవేశం చేసి ఉండగా ఋషులందరూ అతని మీద ఆదరణతో చుట్టూ చేరారు. అదే సమయంలో పరీక్షిత్తును తరింప చేయడానికి శుక యోగీం ద్రుడు అక్కడకి రాగా ఆయనకు పూజలు చేసి తప్పక మరణిం చ వలసిన జీవుడు మరలా జన్మ లేకుండా ఉండటానికి ఏమి చేయాలని పరీక్షిత్తు అడుగగా, ఏడు రోజులలో భాగవత కథను తన ద్వారా వినమని శుక యోగీ చెప్పెను. శుక యోగీ భాగవత కథను చెప్పడానికి సిద్ధపడగా స్వర్గము నుంచి దేవతలందరూ వచ్చి పరీక్షిత్తు చనిపోకుండా అతనికి అమృతం ఇస్తామని ఆ భాగవత కథను తమకు ఇవ్వమని ప్రార్థించిరి. ఆ ప్రార్థన విన్న శుక యోగీంద్రుడు భాగవత కథ ఎక్కడ? అమృతం ఎక్కడ? అమృతానికి భాగవతం ఇవ్వాలా అని పరిహాసం చేసెను. మరణం ఆపే అమృతం కన్నా భాగవత కథ ఎలా గొప్పదని భాగవత కథ విన్నా మరణం తప్పదన్న సందేహం కలిగి ఇందులోని రహస్యం తనకు తెలియజెప్పాలని శుకయోగీని పరీక్షిత్తు అడిగెను.
జీవాత్మ శరీరాన్ని విడిచి పోవడం మరణం. మరణం లేకపోవడం అంటే శరీరంలో జీవాత్మ ఉండడం. మోక్షం అంటే జీవాత్మతో పరమాత్మ ఉండడం లేదా పరమాత్మతో జీవాత్మ ఉండడం. జీవాత్మకు పాంచభౌతికమైన ఈ శరీరం నివాస స్థానం. ఆత్మ ఉండే దానిని శరీరం అంటారు. శరీరంలో ఉండే దానిని ఆత్మ అంటారు. లోతుగా ఆలోచిస్తే ప్రతీ ఆత్మలో పరమాత్మ ఉంటాడు కావున పరమాత్మకు ఆత్మ శరీరం. శరీరంలో ఉండే జీవాత్మను ఎప్పటికీ ఉంచేది అమృతం. కానీ పరమాత్మను ఆత్మలో ఉంచేది భాగవత కథ కావున అమృతానికి భాగవత కథకి పోలిక ఏమిటని శుక యోగీంద్రుడు దేవతలను పరిహసించి పంపించివేసెను. మరణం వద్దనుకున్న వారికి పరమాత్మ లభించడు. ప్రతీ క్షణం బాధలు, రోగాలతో సతమతమయ్యే శరీరాన్ని కోరేకంటే నశించని ఆత్మలో నిత్యానందపరుడైన పరమాత్మను కోరుకోవాలనేది ఈ శ్లోకంలోని ఋషి హృదయం.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి