Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : మాతృదేవోభవ (ఆడియోతో…)

పద్మపురాణంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఉపాధ్యాయాత్‌ దశ ఆచార్య ఆచార్యాణాం శతం పిత
సహస్రేణ పితుర్మాతా గౌరవేణ అతి రిచ్యతే

పది మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు శ్రేష్ఠుడు, నూరు మంది ఆచార్యుల కంటే తండ్రి శ్రేష్ఠుడు, వేయి మంది తండ్రుల కంటే తల్లిని అధికంగా గౌరవించాలి. దగ్గరగా కూర్చొని మంచి నడవడిని బోధించేవాడు ఉపాధ్యాయుడు, శాస్త్రములను తాను చదివి వాటిని పది మందితో చదివించి నియమాలను తానాచరించి పది మందితో ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. ఉపాధ్యాయులు దగ్గర చేరి నీతులు బోధించాలన్నా ,ఆచార్యుడు శాస్త్ర విజ్ఞానం కలిగించాలన్నా కావలసిన దేహాన్ని ఏర్పరిచి కంటికి రెప్పలా ఆ శరీరాన్ని చూసుకుంటూ మనస్సుకు మంచి సంకల్పాన్ని బుద్ధికి, మంచి నిశ్చయాన్ని అందించి నిరంతరం హితం కోరువాడు తండ్రి. శిశువును నవ మాసాలు మోసి ఆ సంతానం కోసం తన ఆహార వ్యవహారాలను నియమించుకొని, ఆరోగ్యపరమైన నియమాలు తాను ఆచరించి పరిపూర్ణ ఆరోగ్యంతో శిశువుకు జన్మనిచ్చి ఆ శిశువు పెంపకంలో తన అలవాట్లను, అభిరుచులను వదిలిపెట్టి ఉపాధ్యాయినిలా దగ్గరుండి నీతిని బోధించి ఆచార్యునిలా ధర్మాన్ని, శాస్త్రాన్ని బోధిస్తుంది తల్లి. అదేవిధంగా తండ్రిలా హితాన్ని కోరి వారెవ్వరూ కోరని ప్రియాన్ని కలిగిస్తూ, తప్పులను తప్పిస్తూ, ముప్పులను దూరం చేస్తూ శిశువు కలగన్న భవిష్యత్తును కూర్చడానికి తహతహలాడేది తల్లి. ఆ తల్లిలోనే పదిమంది ఉపాధ్యాయులు, వంద మంది తండ్రుల మనసులు నిండి ఉన్నాయి. అందుకే ఈ ముగ్గురు కంటే తల్లే అధికంగా పూజించదగినది. అందుకే వేదంలో కూడా మొదలు మాతృదేవోభవ అన్నారు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement