మహాభారతంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన:
చత్వారి తస్య వర్థంతే ఆయు: ప్రజ్ఞ యశోబలం
పెద్దలు కనపడినంతనే నమస్కరించువారికి ఎల్లప్పుడు వృద్ధులను సేవించువారికి ఆయుష్యము, ప్రజ్ఞ, కీర్తి, బలము ఈ నాలుగు వృద్ధి చెందును.
వృద్ధులు అనాగా జ్ఞాన వృద్ధులు, వయో వృద్ధులు, శీల వృద్ధులు, ధర్మ వృద్ధులు అని నాలుగు విధములుగా ఉందురు.
చతుర్వేదములు, చతుశ్శాస్త్రములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు, దివ్య ప్రబంధములు వంటి విద్యాస్థానములకు సంబంధించిన జ్ఞానము కలిగిన వారిని జ్ఞానవృద్ధులుగా వ్యవహరిస్తారు.
వయస్సు పండిన వారిని వయోవృద్ధులు అందురు.
ఉత్తమమైన స్వభావము కల వారిని అనగా కలలో కూడా అబద్ధము ఆడని వారు మరియు పరస్త్రీ పై భావన లేనివారు, పరిహాసములో కూడా అనుచితముగా మాట్లాడని వారు, ప్రాణములు పోవుచన్ననూ యాచించని వారు, కావాల్సినంత మాత్రమే సంపాదించి ఇతరుల సొమ్మును ఆశించనివారు, ఉన్నదానిని పది మందికి పంచి పరుల దు:ఖమును తమ దు:ఖముగా భావించేవారు, పరోపకారమును మరువని వారిని శీల వృద్ధులు అందురు. ఇటువంటి లక్షణాలు కల వారు బాలురు అయినా శీల వృద్ధులుగా పరిగణించబడతారు.
స్వ, పర బేధము లేకుండా ధర్మమును ఆచరించువారు, ప్రభోదించువారు, ధర్మము కోసమే జీవించే వారిని ధర్మ వృద్ధులు అందురు.
ఈ నలుగురిలోఎవరు కనబడినా వెంటనే లేచి నమస్కరించి వారికి కావాల్సిన సేవ చేయవలెను. భూమి మీద అడుగులు వేయడానికి వృద్ధులకు చేయూతను ఇచ్చిన వారికి స్వర్గములో అడుగులు వేయడానికి వృద్ధులు చేయూతనిచ్చెదరు. ఈ విధంగా నిరంతరము పెద్దలను సేవించువారికి దీర్ఘాయుష్షు, అద్భుతమైన మేధాబలం, బుద్ధిమంతుడన్న కీర్తి, సేవలు చేయుటచే కలుగు శరీర వ్యాయామం వలన బలము లభిస్తాయి.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి