Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)


మహాభారతంలోని సుభాషితంపై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

3. అనాచార పద్ధతి.
కపాలే యద్వదాపస్స్యు: శ్వదృతౌవా యధా పయ:
ఆశ్రయస్థాన దోషేణ వృత్తంహీనే తధా శ్రుతమ్‌

పుర్రెలోని జలము, కుక్కతోలు సంచిలో పాలు, తమ ఆశ్రయ దోషము వలన అపవిత్రములగునట్లు ఆచారము (నడవడి) లేనివాని విద్య కూడా అనాదరహేతువగును.

గంగా కావేరి మొదలగు పవిత్ర నదీజలములైనా మానవుని పుర్రెలో పోసినచో అపవిత్రములగును. కుక్కతోలుతో చేసిన సంచిలో ఆవుపాలు అయినా అవవిత్రముగును. వస్తువు మంచిదైనా పరిశుద్ధమైనదైనా అపవిత్రమును, దుష్టమును ఆశ్రయించినచో అపవిత్రమగును. ఆచారము అనగా మంచి నడవడి లేని వాని విద్య కూడా అనాదరహేతువగును. స్మశానములో మొలిచిన పూలచెట్టు పూలను ఎవరూ వాడరు. శాస్త్రమును చదివిననూ శాస్త్రములో చెప్పిన దానిని ఆచరించనివాని చదివిన శాస్త్రము అనాదరహేతువగును. రాక్షసులలో చాలా మంది శాస్త్ర పండితులు, శాస్త్ర గ్రంథ రచయితలే అయినా తాము చదివిన , వ్రాసిన దానిని తామే ఆచరించనందున వారు, వారి విద్య అనాదరహేతువులైనవి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూనే శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement