శ్రీరామనవమి పర్వదినం యొక్క విశిష్టత గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
చైత్ర శుక్ల నవమి శ్రీరామనవమి. శ్రీరామనవమి చైత్రశుక్ల నవమీ పునర్వసు నక్షత్రం మధ్యాహ్నము కర్కాటక లగ్నములో శ్రీరామచంద్రుడు అవతరించాడు.
తస్మిన్దినే తుకర్తవ్యము పవాసవ్రత: సదా
తత్ర జాగరణం కుర్యాతే రఘునాథపరో భువి
చైత్ర శుక్ల నవమి నాడు ఉపవాస వ్రతమును ఆచరించి రాత్రి పూట జాగరణము చేయవలయును. శ్రీరామనవమి నాడు పునర్వసు నక్షత్రయుతమైనచో కోటిసూర్య గ్రహణములకన్నా అధిక పర్వము, అఖిల పుణ్యప్రదము. నవమినాడు ఉపవాసం చేసి దశమినాడు పారణ చేయవలెనని హేమాద్రి ద్వారా తెలుస్తోంది.
శ్రీరామనవమి నాడు ఉపవాసం జాగరణము, పితరులకు తర్పణమును, బ్రహ్మ ప్రాప్తిని ఉద్దేశించి చేయవలెను. ఇది అందరికి ధర్మము, భుక్తి ముక్తులకు ఒకే సాధనం. అపరిశుద్ధుడు పాపిష్టుడు అయినను ఈ వ్రతమును ఆచరించినచో రామచంద్రుడు వలె అందిరికి పూజ్యుడగును. శ్రీరామనవమి దినాన ఉపవాసం చేయని వాడు కుంభీపాక నరకమును పొందునని పురాణ వచనం. ఈనాడు శ్రీరాముని బంగారు ప్రతిమను దానం చేయాలి. ఆచార్యులకు ముందుగానే ప్రతిమా దానం చేసెదనని తెలిపి స్వీకరించి కృతార్థుని చేయమని విజ్ఞాపన చేసి దానము చేయవలెయును.
ఇమాం స్వర్ణమ యీం రామ ప్రతిమాం చప్రయత్నత:
శ్రీరామ ప్రీతయే దాస్యే రామ భక్తాయ ధీమతే
ప్రీతో రామోహరత్యాశు పాపాని సుబహూనిమే
అని మంత్రము పఠించి సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర ప్రతిమను దానము చేయవలెయును. రామ ప్రతిమకు పంచామృత స్నానమాచరింప చేసి షోడశోపచార పూజ
చేసి దానము ఈయవలెను. ఈ విధంగా చేసిన సకలాభీష్ట సిద్ధి, శ్రీరామ అనుగ్రహ ప్రాప్తి, శ్రీరామ సాయుజ్యము తప్పక లభించును.