ప్రత్యాహారం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
ప్రత్యాహారము అనగా వెనకకు మరల్చుకొనుట. మన ఇంద్రియములు విషయముల నందు ప్రవర్తించుచుండును. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణము అను అయిదు జ్ఞానేంద్రియములు.
త్వక్ – స్పర్శను, చక్షువు – రూపమును, శ్రోత్రము – శబ్ధమును, జిహ్వా – రసమును, ఘ్రాణము – గంధమును తెలుపును
స్పర్శ, రూపము, శబ్ధము, రసము, గంధము ఈ ఐదు విషయములనబడును. ఈ విషయములందు ఇంద్రియములు ప్రవర్తించుట వలన వాటితో సంబంధము గట్టివపడుచుండును. మళ్ళీ మళ్ళీ అవే కావాలి అని మనస్సు ఇంద్రియములను ప్రేరేపించును. ఒక అందమైన వస్తువును చూచినపుడు ఆ వస్తువులోని అందాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అని మనస్సు కోరుతుంది. అపుడు ఆ వస్తువుతో మనస్సుకు సంబంధం పెరుగుతుంది. ఇదే రుచి, వాసన, స్పర్శలకు కూడా వర్తిస్తుంది.
అంటే ఇంద్రియములు ఆ విషయములలోకి వెళ్ళి వాటినే స్వీకరిస్తుంటే ఇక మనస్సు వాటిని విడిచి రాదు. ఇలా ఇంద్రియాలను విషయాల వైపు పరిగెత్తించుటే సంసారం. ఒక అందాన్ని చూచినపుడు కనబడుతున్న అందాన్ని కాక ఇంత అందమైన ప్రకృతిని సృష్టించిన పరమాత్మ ఎంత అందగాడో అని తలచి ఇలా కనబడుతున్న అందం నుండి కనులను మరల్చి కనులతో అందాన్ని చూపించే భగవంతుని వైపు త్రిప్పుటే ప్రత్యాహారం. ఏ వస్తువు తనకు తానుగా అందముగా, రుచిగా, తియ్యగా, సువాసనగాను ఉండదు. ఉదాహరణకు :- లడ్డు రుచిగా ఉంటే దానిని తయారు చేసిన వారిని మెచ్చుకున్నట్టే అందమైన ప్రకృతిని సృష్టించిన భగవంతునిని మెచ్చుకోవాలి . ఇలా విషయాల వైపు వెళుతున్న ఇంద్రియాలను వెనక్కు మరల్చి భగవంతుని వైపు మరల్చటమే ప్రత్యాహారం. ఇలా ప్రత్యాహారం చేస్తే విషయాలతో మన సంబంధాలు తొలగిపోతాయి.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి