మహాభారతంలోని సుభాషితంపై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
దానం భోగ: నాశ: తిస్రో గతయో భవంతి విత్తస్య
యో నదదాతి నభుఙ్త్కే తస్య తృతీయా గతిర్భవతి
ధనమునకు మూడు దశలుండును వాటిలో మొదటిది దానం చేయుట, రెండవది తాను అనుభవించుట, మూడవది నశించుట. అపారమైన ధనము లభించిన వాడు తనకు లభించిన ధనముతో దానము చేయక తాను భోగము అనుభవించని నాడు ఆ ధనము నశించక తప్పదు.
ధనము చంచలమైనది ఎంత సంపాదించినా ఆ ధనము ఒకరి దగ్గరే కలకాలం స్థిరముగా ఉండదు. ఒకచోట నుండి మరొక చోటుకు ప్రతీ క్షణం మారుతూనే ఉంటుంది. చేతులు మారుట ధనం ల క్షణం. ఆ మారడం అనేది దానము చేయుటతోనో అనుభవించుటతోనో అయితే కీర్తి, పుష్టి, తుష్టి, తృప్తి కలుగును. లభించిన ధనాన్ని దాచిపెట్టాలని భావించిన నాడు రాజు ఆస్తిపన్ను, ఆదాయపు పన్ను, వృత్తి పన్ను అని రకరకాలుగా అపహరిస్తారు లేదా ఉన్నది దొంగల పాలవుతుంది. బంధువులు, బలవంతులు, అపహరించుకొని పోవచ్చు లేదా కన్నపిల్లలే ఆ ధనమును బలవంతంగా తీసుకోవచ్చు. డబ్బు దాచుకొని ఇటువంటి వేదన పడుట కంటే ఉన్న ధనాన్ని వీలున్నంత ఎక్కువగా దానం చేసి ఉన్నదానితో కావాల్సిన రీతిలో అనుభవించాలి. పదిమందికి పెట్టి తాను తిన్ననాడు ధనానికి అపాయమే ఉండదు. ధనము బలవంతాన పరుల పాలు కాకపోయినా తానే స్వయంగా ఇచ్చినా కూడా ధనము నిలువ వుండదు. అపుడు ఎటువంటి ఆపద, భయము వుండవు. ధనాన్ని దాచుకున్న వారు ఒంటరిగా, దానం చేసేవారు పదిమందితో ఉంటారు. పదిమందితో ఉన్నవారికి దొంగలు దొరల భయం లేదు.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూనే శ్రీలక్ష్మి